ట్రంప్.. మ్యాన్ ఆఫ్ ద ‘‘ఇయర్’’ అంట...?

ట్రంప్ ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు గత వారం ఆయనపై అనూహ్యంగా కాల్పులు జరిగాయి.

Update: 2024-07-20 17:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అందరికీ మహా ఆసక్తే.. అసలే అగ్ర రాజ్యం.. అందులోనూ ఇద్దరు సీనియర్ నేతల పోటీ.. అధ్యక్షులుగా అనుభవం ఉన్నవారే.. మరోవైపు ప్రపంచం అంతా యుద్ధాలు, సంక్షోభాల కాలం నడుస్తుండగా అమెరికాను రాబోయే నాలుగేళ్లు పాలించేది ఎవరు? అనేది కీలకమైన విషయమే. ఓవైపు భారత్ లో వచ్చే ఐదేళ్లు మోదీ.. మరోవైపు రష్యాకు పుతిన్.. చైనాకు జిన్ పింగ్..? వీరి సరసన నిలిచేది రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నా..? అసలు డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ పోటీలో ఉంటారా? అనేది మరో కీలక అంశం.


సందట్లో సడేమియాలా కాల్పులు..?

ట్రంప్ ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు గత వారం ఆయనపై అనూహ్యంగా కాల్పులు జరిగాయి. కాగా.. ట్రంప్ పై హత్యాయత్నం వెనుక ఉన్నది ఉక్రెయిన్ అని.. లేదు ఇరాన్ అని అనేక వాదనలు వచ్చాయి. దీంతో ఈ ఘటన అంతర్జాతీయ అంశంగానూ మారింది. కాకపోతే.. ఆరోపణలు ఏవీ ధ్రువీకరణ కాకపోవడంతో హత్యాయత్నం వెనుక ఉన్నది ఇప్పటికైతే మాథ్యూ క్రూక్స్ గా భావిస్తున్నారు.

ఆ ఇయర్.. ఈ ఇయర్..

గత వారం పెన్సిల్వేనియాలో జరిగిన దాడిలో ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన తన సహజ శైలిలో ప్రసంగిస్తూ తలను ఒకవైపునకు తిప్పారు. దీంతోనే క్రూక్స్ పేల్చిన తూటా ఆయన కుడి చెవిని తాకుతూ వెళ్లిపోయింది. ఆయన కుడి చెవి పైభాగంలో గాయమైంది. ఆ గాయానికి పెద్ద ప్లాస్టర్ వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అమెరికాలో ఫ్యాషన్ గా మారడం కూడా విశేషం. కాగా, ట్రంప్ గనుక నవంబరులో జరిగే ఎన్నికల్లో గెలిస్తే ‘మ్యాన్ ఆఫ్ ద ఇయర్’ గా నిలుస్తారు. అత్యంత శక్తిమంతమైన దేశానికి బలమైన అభిప్రాయాలున్న ట్రంప్ అధ్యక్షుడు అయితే పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పవచ్చు. కాగా, ట్రంప్ నకు అయిన గాయాన్ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ సెటైరిక్ గా చూపించినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. దానిప్రకారం.. మ్యాన్ ఆఫ్ ద ‘‘ఇయర్’’ అంటూ ట్రంప్ చెవికి బ్యాండేజీతో ఉన్న ఫోను కవర్ పేజీపై ముద్రించింది. ఈ క్రికెయేటివిటినీ అందరూ ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News