ఒకే రోజు 2 హైఓల్టేజ్ పొలిటికల్ ప్రోగ్రాం.. న్యూస్ చానళ్లకు పండుగే
ఈ రోజు (మంగళవారం)న అధికార.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రెండు కీలక కార్యక్రమాలు.. అది కూడా హైఓల్టేజ్ ఉన్న రాజకీయ పరిణామాలకు
సాధారణంగా ఎన్నికలు ముంచుకు వచ్చే వేళలో చోటు చేసుకునే పరిణామాలు.. తెలంగాణలో మాత్రం రేవంత్ సర్కారు కొలువు తీరిన రెండునెలలకే చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ రోజు (మంగళవారం)న అధికార.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రెండు కీలక కార్యక్రమాలు.. అది కూడా హైఓల్టేజ్ ఉన్న రాజకీయ పరిణామాలకు నెలవుగా ప్రోగ్రాంలను షెడ్యూల్ చేయటం తెలిసిందే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ రెండు కార్యక్రమాలు నీళ్లు.. నీళ్ల ప్రాజెక్టులకు సంబంధించినవి కావటం గమనార్హం. తమ ఎత్తులతో పెద్ద ఎత్తున భావోద్వేగాల్ని రగల్చటమే లక్ష్యంగా అధికార.. విపక్ష పార్టీలు స్కెచ్ వేయటం ఆసక్తికరంగా మారింది.
మరికొద్ది వారాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల్ని తమవైపు తిప్పుకునేందుకు వీలుగా అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ లు పోటాపోటీ కార్యక్రమాలకు తెర తీయటంతో ఈ రోజు రాజకీయం హాట్ హాట్ గా మారుతుందని చెప్పక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లనుపూర్తి చేసింది. కేసీఆర్ సర్కారు హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని.. ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా అందరికి చూపేందుకు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కారు హయాంలో ఏం జరిగిందో తెలిపేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లుగా చెప్పాలి.
లోపాల పుట్ట మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళతామన్న ముఖ్యమంత్రి.. తాను ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కార్యాచరణను సిద్ధం చేయటం గమనార్హం. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్.. కోమటిరెడ్డి.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీలకు బయలుదేరనున్నారు. దీంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధుల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. బ్యారేజీని పరిశీలించేందుకు వీలుగా బ్యారేజీ దిగువన.. గోదావరి తీరానికి వెళ్లేందుకు వీలుగా మార్గాల్ని సిద్ధం చేశారు.వ్యూ పాయింట్ వద్ద 3వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసి.. బ్యారేజీ నిర్మాణ లోపాలు.. ఇతర అంశాలపై సభను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా లోపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
ఉదయం 10.15 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లామహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు బ్యారేజీని పరిశీలించి.. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం రేవంత్.. మంత్రులు మీడియాతో మాట్లాడతారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ను రావాలని కోరిన ఉత్తమ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. క్రిష్ణా జలాలపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక బహిరంగ సభలో మాట్లాడటం ఇదే తొలిసారి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సెషన్ జరుగుతున్న వేళలో.. సభకు హాజరు కాని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. సభకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కోరటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్రిష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే నల్గొండ సభను ప్లాన్ చేశారు. భావోద్వేగాల్ని రగిలించేందుకు అవకాశం ఉన్న అంశాన్ని ఎంచుకున్నారు. అయితే.. ఆయన ప్లాన్ కు గండి కొట్టేలా రేవంత్ రివర్సు ప్లాన్ చేశారు. సోమవారం సభలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన క్రమంలో నల్గొండ సభలో ఏ అంశాన్ని ఎజెండాగా తీసుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను భారీ ఎత్తున చేపట్టి.. విజయవంతం చేయాలన్న లక్ష్యంతో గులాబీ దళం పని చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా కాంగ్రెస్ సర్కారును ఎండగట్టాలన్నది ప్లాన్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సభను కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు తమతోనే సాధ్యమన్న బలమైన సందేశాన్ని ఇవ్వటమే ఈ సభ లక్ష్యమైనప్పటికీ.. ఇప్పటికే అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన క్రమంలో కేసీఆర్ స్పీచ్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకే రోజున అధికార.. విపక్ష పార్టీల రెండు కీలక ప్రోగ్రాంలు గంటల తరబడి చేస్తుండటంతో టీవీ చానళ్లకు చేతినిండా పని ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజు మొత్తం న్యూస్ చానళ్లకు పండుగే అన్న మాట వినిపిస్తోంది.