టీటీడీ చైర్మన్ పోస్టు ఆ ఇద్దరూ రేసులో !?
అన్న ఎన్టీఆర్ తో సినిమాలు తీసి భారీ నిర్మాత అయిన అశ్వనీదత్ టీటీడీ చైర్మన్ పదవి కోసం చూస్తున్నారు అని టాక్.
ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం టీడీపీ జనసేనలో ఇద్దరి మధ్యన రేసు నడుస్తోంది అని అంటున్నారు. ఆ ఇద్దరూ సినీ ప్రముఖులే కావడం విశేషం. అన్న ఎన్టీఆర్ తో సినిమాలు తీసి భారీ నిర్మాత అయిన అశ్వనీదత్ టీటీడీ చైర్మన్ పదవి కోసం చూస్తున్నారు అని టాక్.
ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. బాబు గత ఏడాది అరెస్ట్ అయితే ఆయన రాజమండ్రి జైలు దాకా వచ్చి వెళ్లారు. కుటుంబాన్ని పరామర్శించారు. అండగా నిలబడ్డారు. అదే విధంగా చూస్తే ఆయన తెలుగుదేశం పక్షాన ఉంటూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. టీడీపీ కూటమి 160 సీట్లకు పైగా గెలుస్తుదని జోస్యం మొదట చెప్పింది ఆయనే. అలాగే 164 సీట్లు దక్కాయి.
మరో వైపు చూస్తే మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారు. ఆయన అనకాపల్లి ఎంపీ సీటుని వదులుకున్నారు. పొత్తులలో త్యాగం చేశారు. ఆయనకు రాజ్యసభ ఇస్తారు అని అనుకున్నా ఇప్పట్లో అది సాధ్యపడదు. దాంతో ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని ఇప్పించేందుకు జనసేన అధినేత పవన్ గట్టిగా ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
దాంతో ఈ ఇద్దరిలో ఒకరికి ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. టీటీడీ చైర్మన్ గా గత ఏడాది ఆగస్టులో నియమితులు అయిన భూమన కరుణాకరరెడ్డి పది నెలల పాటు పనిచేశారు. వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆయన తాజాగా రాజీనామా చేశారు.
దీంతో ఈ పదవిలో ఎవరిని నియమించాలి అన్నది చంద్రబాబు ముందు బిగ్ టాస్క్ గా ఉందని అంటున్నారు. అయితే చంద్రబాబు అన్నీ ఆలోచించిన మీదటనే ఈ ఇద్దరిలో ఒకరికి ఈ పదవి ఇస్తారని అంటున్నారు. ఈ ఇద్దరే కాకుండా చాలా మంది ఈ పదవి కోసం చూస్తున్నట్లుగా చెబుతున్నారు. వారిలో సీనియర్ నేతలు పార్టీలో బిగ్ షాట్స్ కూడా ఉన్నారని అంటున్నారు. అలా చూసుకుంటే ఒక టీవీ చానల్ యజమాని పేరు కూడా ఉందని అంటున్నారు.
ఇక టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు చూస్తే టీవీ చానల్ యజమానికి తొలి రెండేళ్ళు ఈ పదవి ఇచ్చి ఆ మీదట మిగిలిన వారికి ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.ఇక బీజేపీ నుంచి గెలిచిన ఒక ఎంపీ కూడా ఈ పదవి కోసం చూస్తున్నారు అన్నది మరో టాక్. దాంతో టీటీడీ చైర్మన్ పదవి చాలా కీలకంగా మారింది.
ఇవన్నీ పక్కన పెడితే తాను టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్నట్లుగా వస్తున్న వార్తలను మెగా బ్రదర్ తోసిపుచ్చారు. రోజంతా సాగిన ఈ ప్రచారంపై స్వయంగా నాగబాబు స్పందించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.
'ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లేదా నా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి తప్పుడు వార్తలను విశ్వసించవద్దు లేదా ప్రచారం చేయవద్దు.' అని నాగబాబు ఎక్స్ వేదికగా తాజాగా ఒక ట్వీట్ చేశారు.
దాంతో నాగబాబు రేసులో ఉన్నారా లేక ఆయన పేరిట వచ్చిన ప్రచారంలో నిజమెంత అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే కీలక నామినేటెడ్ పదవుల మీద నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు.