భారత్ లో లక్షల సంఖ్యలో ఖాతాలపై ట్విట్టర్ వేటు.. కారణమిదే!
టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడయితే ట్విట్టర్ ను కొనుగోలు చేశారో అప్పటి నుంచి అందులో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడయితే ట్విట్టర్ ను కొనుగోలు చేశారో అప్పటి నుంచి అందులో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. దానిలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. అంతేకాకుండా ట్విట్టర్ అఫీషియల్ టిక్ కావాలంటే ప్రతి నెలా నగదు సమర్పించుకోవాల్సిందేనని మస్క్ తేల్చిచెప్పారు. దీంతో అధికారిక ధ్రువీకరణ కోసం ట్విట్టర్ ను వినియోగించేవారు ప్రతి నెలా రుసుము చెల్లించకతప్పడం లేదు.
మరోవైపు ఒక్క నెలలోనే భారతదేశంలో 2,34,584 ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 25 వరకు భారతదేశంలో 2,34,584 ఖాతాలపై రికార్డు స్థాయిలో నిషేధాన్ని విధించింది. ఈ నిషేధానికి గురయిన ఖాతాల్లో ఎక్కువ పిల్లల లైంగిక దోపిడీ, నగ్నత్వాన్ని ప్రోత్సహించేవనని తెలుస్తోంది.
అదేవిధంగా దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మరో 2,755 ఖాతాలను కూడా ఎక్స్ తొలగించింది. మొత్తంగా ఒక్క నెల రోజుల్లోనే 237,339 ఖాతాలపై వేటు వేసింది.
కాగా ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 25 వరకు ఎక్స్ భారతదేశంలో మొత్తం 5,57,764 ఖాతాలను ఎక్స్ నిషేధించింది. వీటికి అదనంగా దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 1,675 ఖాతాలను తొలగించింది.
తాజాగా తన నెలవారీ నివేదికలో ఎక్స్ పలు విషయాలను వెల్లడించింది. 2021కి అనుగుణంగా తన ఫిర్యాదుల పరిష్కార విధానాల ద్వారా నిర్దేశిత సమయంలో భారతదేశంలో 3,229 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించింది. ఇవి కాకుండా మరో 78 ఫిర్యాదులను పరిష్కరించే పనిని చేపట్టినట్టు తెలిపింది.
భారతదేశం నుండి వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం ద్వేషపూరిత ప్రవర్తన (1,424), దుర్వినియోగం/వేధింపు (917), పిల్లల లైంగిక దోపిడీ (366) అడల్డ్ కంటెంట్ (231) ఉన్నాయి.
కొత్త సోషల్ మీడియా నిబంధనలు 2021 ప్రకారం.. 5 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్రధాన డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు నెలవారీ నివేదికలను విడుదల చేయాలి.
ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన 3,25,000 ఖాతాలపై కూడా ఎక్స్ చర్యలు తీసుకుంది.