తూ.గో.లో ట్విన్స్ విలేజ్... నెంబర్ తెలిస్తే షాకే!
ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదూ ఏకంగా 500ల మంది వరకూ కవల జంటలు ఉన్నట్లు అంచనా!
సాధారణంగా ఒక ఊరిలో కవలలు (ట్విన్స్) ఎంతమంది ఉంటారు. గ్రామానికి ఒకరో, ఇద్దరో!! కానీ... పదుల సంఖ్యలో కాదు, ఏకంగా వందల సంఖ్యలో కవలలు ఒకే గ్రామంలో ఉంటే? అలాంటి గ్రామం కూడా ఉంటుందా? అంటే... ఉందనే చెప్పాలి! ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదూ ఏకంగా 500ల మంది వరకూ కవల జంటలు ఉన్నట్లు అంచనా!
అవును... సుమారు 5,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 500ల మంది వరకూ కవల జంటలు ఉన్నట్లు చెబుతునారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం కథ ఇది. ఈ గ్రామంలో ఏ వీధిలో చూసినా ఒకే పోలికతో ఉండే కవలలు అడుగడుగునా తారసపడుతుంటారు. దీంతో ఈ దొడ్డిగుంట గ్రామాన్ని కవలల గ్రామంగా పిలుస్తుంటారు.
అయితే ఈ గ్రామంలోనే ఎందుకు ఇలా ఈస్థాయిలో కవల పిల్లలు ఉంటున్నారు అని అంటే... అందుకు ఆ గ్రామస్తులు చెప్పే మాట కాస్త డిఫరెంట్ గానే ఉంది. అవును... ఇక్కడ ప్రధానంగా కవలలు ఎక్కువగా జన్మించడానికి ప్రధాన కారణం ఆ ఊరిలో మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న బావి నీరు అట.
ఈ విషయం కాస్తా వైరల్ గా మారడంతో కవల పిల్లలు కావాలనుకునే జంటలు ఆ ఊరి బావి నీటి కోసం ఇప్పుడు క్యూ కడుతున్నారట. ఆ బావి నీటిలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ నీరు సర్వరోగ నివారిణి అని గ్రామస్తుల నమ్మకంగా చెబుతుండటం మరో విచిత్రం!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ గ్రామం నుంచి పలువురు ఉన్నత చదువులు అభ్యసించి.. ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారట. అయితే, అలాంటివారితోపాటు ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి సైతం కవల పిల్లలే పుడుతున్నారని గ్రామస్తులు చెబుతుండటం.
వాస్తవానికి ఈ గ్రామంలో కవలలు ఎక్కువనే విషయం ఆ గ్రామస్తులకు తెలియదంట. అయితే ఆ ఊరికి ట్రాన్స్ ఫర్ మీద వచ్చిన ఒక ఉపాధ్యాయుడు జనాభా లెక్కలు చేపడుతున్న సమయంలో ఈ విషయాన్ని గమనించారంట. ఆ తర్వాత ఆయనకు చాలాకాలంగా పిల్లలు కలగకపోవడంతో... ఈ గ్రామానికి ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన భార్య కూడా కవల పిల్లలకు జన్మనిచ్చారంట.
నాటి నుంచి ఈ గ్రామం పేరు మారుమోగిపోయిందని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలు పుట్టనివారు, కవలలు కావాలనుకునేవారు ఈ ఊరి బావి నీటి కోసం క్యూ కడుతున్నారని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఆ బావి నీళ్ల వల్లే ఇక్కడ కవల పిల్లలు కలుగుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కవలలు జన్మించడానికి జన్యుపరమైన పలు కారణాలుంటాయని.. వాటితోపాటు వంశపారంపర్యత కూడా కవలలకు ఓ కారణంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయని అంటున్నారంట. ఇలా బావి నీటివల్ల కవల పిల్లలు పుడుతున్నారనేది అశాస్త్రీయమని నొక్కి చెబుతున్నారంట.
ఏది శాస్త్రీయమైనా, మరేది అశాస్త్రీయమైనా... పిల్లలు కావాలనుకునేవారు, కవల పిల్లలు కలగాలనుకునేవారు మాత్రం ఈ గ్రామానికి క్యూ కడుతున్నారని అంటున్నారు.