ఇప్పటికి ఆ ఇద్దరు వివాదాస్పద డీఎస్పీలపై బదిలీ వేటు

కొన్ని నిర్ణయాలు రెప్పపాటు వేగంతో జరిగిపోవాలి. అందుకు భిన్నమైన వాతావరణం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నెలకొంది.

Update: 2024-07-31 06:30 GMT

కొన్ని నిర్ణయాలు రెప్పపాటు వేగంతో జరిగిపోవాలి. అందుకు భిన్నమైన వాతావరణం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నెలకొంది. అధికార బదిలీ జరిగిన తర్వాత పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు సంకేతాలు బలంగా వెళ్లాలన్నా.. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటన్న విషయాన్ని కొన్ని నిర్ణయాలతో అందరికి తెలిసేలా చేయటం పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. అలాంటి నిర్ణయాలకు నెలల తరబడి సమయం తీసుకోవటం దేనికి నిదర్శనం? అందునా.. వివాదాస్పద వైఖరితో వ్యవహరించే వారి మీద చర్యలకు ఇంతకాలం పడితే.. మిగిలిన అంశాల మీద నిర్ణయాలకు ఇంకెంత కాలం పడుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్న రాజంపేట.. తూళ్లూరు డీఎస్పీలు వీఎన్ కే చైతన్య.. అశోక్ కుమార్ గౌడ్ లపై కూటమి సర్కారు తాజాగా బదిలీ వేటు వేసింది. వారిద్దరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డు మీటింగ్ లో తాజా నిర్ణయం తీసుకొని ఆదేశాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ వేటు పడిన ఇద్దరు డీఎస్పీల మీద ఉన్న ఆరోపణలు ఏమిటన్న విషయంలోకి వెళితే.. వీఎన్ కే చైతన్య అత్యంత వివాదాస్పద అధికారిగా చెబుతారు. తాడిపత్రి డీఎస్పీగా ఉన్నప్పుడు నాటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లు మాత్రమే పని చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. టీడీపీ నాయకులు.. కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన పని తీరుకు తగ్గట్లే తాడిపత్రి బాధితులు ఆయనపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేసినట్లుగా చెబుతారు. తాడిపత్రి నుంచి రాజంపేటకు బదిలీ మీద వెళ్లిన తర్వాత అక్కడ కూడా అలాంటి సీన్ చూపించారని చెబుతారు.

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. అర్థరాత్రి వేళ తాడిపత్రిలోని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి అర్థరాత్రి వేళ చొరబడి.. టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేసి.. సీసీ కెమెరాలే ధ్వంసం చేసిన ఉదంతంతో పాటు.. రాజంపేట డీఎస్పీగా ఉండి.. అర్థరాత్రి వేళ తాడిపత్రికి రావటం.. జేసీ ఇంట్లో పని చేసే దివ్యాంగుడైన కిరణ్ కుమార్ ను దారుణంగా కొట్టిన ఘటనల్లో ఆదిత్య కీరోల్ ప్లే చేశారన్న పేరుంది.

అశోక్ కుమార్ గౌడ్ విషయానికి వస్తే..టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను తీవ్రంగా వేధించిన ఆరోపణలు ఉన్నాయి. చింతమనేనిని ఓపెన్ వార్నింగ్ ఇవ్వటంతో పాటు.. పలు సందర్భాల్లో దురుసుగా వ్యవహరించారన్న పేరుంది. ఎన్నికలకు కాస్త ముందు తూళ్లూరుకు బదిలీ మీద వచ్చిన ఆయన.. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సందర్భంలో మందడంలోని అమరావతి రైతులు టపాసులు కాలిస్తే.. వారిపై దురుసుగా వ్యవహరించారన్న విమర్శ ఉంది. ఇంతటి వివాదాస్పద అధికారులపై బదిలీ వేటు వేయటానికి ప్రభుత్వానికి ఇంత టైం తీసుకుంటే.. డ్యూటీని డ్యూటీగా చేయకుండా వ్యవహరించిన వారిపై చర్యలు ఇంకెన్నాళ్లు పడుతుందో అన్న పెదవి విరుపు కనిపిస్తోంది.

Tags:    

Similar News