కేసుల క‌త్తి: వెన‌క్కి త‌గ్గిన స్టాలిన్ త‌న‌యుడు!!

అంతేకాదు.. త‌న వ్యాఖ్య‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించిందంటూ.. కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తాను స‌నాత‌న ధ‌ర్మానికి వ్య‌తిరేకం కాద‌ని పేర్కొన్నారు.

Update: 2023-09-08 11:12 GMT

కేసుల క‌త్తి.. ఎంత‌టి వారినైనా మ‌డ‌మ వెన‌క్కి తిప్పేలా చేస్తుంది. త‌ల‌పండిన ముఖ్య‌మంత్రులు సైతం.. మోడీ స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టించి.. ఆన‌క కేసుల బూచితో వెన‌క్కి త‌గ్గిన సంద‌ర్భాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇక‌, అప్ర‌తిహ‌త విజ‌యం ద‌క్కించుకుని కూడా మోడీకి సేవ చేస్తున్న ముఖ్య‌మం త్రులూ మ‌న ముందే ఉన్నారు. దీనికి కార‌ణం.. కేసులు, జైళ్లు, విచార‌ణ‌లు. ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు యువ నాయ‌కుడు, త‌మిళ‌నాడు సీఎం త‌న‌యుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉద‌య‌నిధి.

నిన్న‌టి వ‌ర‌కు స‌నాత‌న ధ‌ర్మం విష‌యంలో త‌న విమ‌ర్శ‌లు ఆపేది లేద‌ని, త‌ను ఎంతదూర‌మైనా వెళ్తాన‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన యువ నాయ‌కుడు.. ఒక్క‌సారిగా గాలి తీసేసిన బూర మాదిరిగా అణిగిపోయారు.

అంతేకాదు.. త‌న వ్యాఖ్య‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించిందంటూ.. కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తాను స‌నాత‌న ధ‌ర్మానికి వ్య‌తిరేకం కాద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ఏ మ‌తాన్నీ కించ‌ప‌ర‌చ‌లేద‌ని కూడా తాజాగా ఉద‌య‌నిధి చెప్పుకొచ్చారు.

స‌నాత‌న ధ‌ర్మంపై తన వ్యాఖ్యలను ఓ సామాజికవర్గంపై ఊచకోతకు ఉసిగొల్పినట్టు వక్రీకరించారని ఆరోపించారు. ఈ తప్పుడు వార్తల ఆధారంగా అమిత్‌ షా లాంటి కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారని ఉద‌య‌నిధి అన్నారు. 'సనాతన’ వివాదంపై డీఎంకే శ్రేణులకు స్పష్టత ఇచ్చేందుకు ఈ ప్రకటన విడుదల చేశారు. తాను గానీ, డీఎంకే గానీ ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు.

క‌ట్ చేస్తే.. ఉద‌య‌నిధిలో ఇంత అనూహ్య మార్పు వెనుక.. కేంద్రం కేసుల క‌త్తి దూసేందుకు రెడీ అయింద‌నే స‌మాచారం త‌మిళ‌నాడు స‌ర్కారుకు అందిన‌ట్టు తెలిసింది. అందుకే వెన‌క్కి తగ్గేలేదని, స‌నాత‌న ధ‌ర్మంపై ఎంత వ‌ర‌కైనా పోరాడేందుకు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన యువ నాయ‌కుడు ఉద‌య‌నిధి.. ఒక్క‌సారిగా వెన‌క్కి త‌గ్గార‌న్న‌మాట‌. ఏదేమైనా కేసుల క‌త్తి ప్ర‌భావం అలాంటిది!!

Tags:    

Similar News