అక్రమ వలసదారుల మాటున.. యూకేలో భారత రెస్టారెంట్లు టార్గెట్!
యూకే ప్రభుత్వం వాస్తవానికి మొన్నటివరకు అక్రమ వలసదారులపై కఠిన చర్యలను గురించి ఆలోచించలేదు. గత జూలైలో ప్రధాని కీర్ స్టార్మర్ ఎన్నికయ్యాక మాత్రం అక్రమ వలసలపై మాట్లాడారు.
అమెరికా బాటలోనే అక్రమ వలసదారుల ఏరివేత పాట పాడుతున్న యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ఇప్పుడు మరింత ముందుకెళ్తోంది.. అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా భారతీయ రెస్టరంట్లను టార్గెట్ చేసింది. వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పరిణామాలను బట్టి తెలుస్తోంది. అమెరికాలో అత్యధిక శాతం భారతీయ విద్యార్థులు పనిచేసేది భారతీయ హోటళ్లలోనే. అందుకనే ట్రంప్ ఆంక్షలతో అక్కడ కల్లోలం రేగింది. ఇప్పుడు బ్రిటన్ కూడా ఇదే పనిచేస్తోంది.
యూకే ప్రభుత్వం వాస్తవానికి మొన్నటివరకు అక్రమ వలసదారులపై కఠిన చర్యలను గురించి ఆలోచించలేదు. గత జూలైలో ప్రధాని కీర్ స్టార్మర్ ఎన్నికయ్యాక మాత్రం అక్రమ వలసలపై మాట్లాడారు. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. అయితే, అమెరికాలో ట్రంప్ చేస్తున్న చర్యలను చూసి యూకే కూడా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఇందులో ప్రధానంగా భారతీయ రెస్టరంట్లను లక్ష్యంగా చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.
క్షుణ్నంగా తనిఖీలు..
‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టరంట్లలో పెద్దఎత్తున సోదాలు చేయిస్తోంది యూకే సర్కారు. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై ముందుగా అనుకున్నట్లే తనిఖీలు చేపట్టింది. సోమవారం వరకు 600 మందిని అరెస్టు చేసింది.
హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టరంట్ పై జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. దక్షిణ లండన్ లోని ఓ భారతీయ గ్రాసరీ గోదాంలో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడానికే ఈ కఠిన చర్యలు అని యూకే ప్రభుత్వం చెబుతోంది. గత నెలలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేసి అక్రమంగా పనిచేస్తున్న 609 మందిని అరెస్టు చేశారు.
దేశంలో అక్రమ వలసలు పెరిగాయి. ఇలాంటివారు చాలామంది పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని స్టార్మర్ ప్రకటించారు.
స్టార్మర్ సర్కారు దాదాపు 4వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసింది. ఇప్పుడు భారతీయ రెస్టరంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థుల బిల్లుపై యూకే పార్లమెంటులో సోమవారం చర్చ జరిగింది.