బీఆర్ఎస్ కు 'గ్రూప్స్' దెబ్బ.. దిగివచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ)ని ప్రక్షాళన చేస్తామని, నిరుద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని.. తమను నమ్మాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు.. బీఫారాలు కూడా ఇచ్చేసింది. అధికారంపై ధీమాగా కూడా ఉంది. మళ్లీ వచ్చేది మన సర్కారే అంటూ.. సీఎం కేసీఆర్ ప్రకటనలు కూడా చేశారు.
అయితే.. ఎంత ధీమాగా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని కీలక విషయాలు మాత్రం బీఆర్ ఎస్ పార్టీకి పంటికింద రాయిలా మారాయి. దీంతో ఓటు బ్యాంకు ఎక్కడ కదలబారి పోతుందోననే ఆవేదన కనిపిస్తోంది.
ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కవ తమకు వ్యతిరేకంగా అడుగులు వేస్తారోననే ఆవేదన బీఆర్ ఎస్‌లో కనిపిస్తోంది. గ్రూప్-1, 2 పరీక్షల విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు.. నిరుద్యోగ యువతను తీవ్రంగా కలవరానికి గురి చేశాయి.
దీంతో వారంతా సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని మొదట్లో లైట్ తీసుకున్న అధికార పార్టీ.. ఇప్పుడు దిగివచ్చింది. తాజాగా కేసీఆర్‌కు అందిన సర్వేల్లో నిరుద్యోగ యువత గ్రూప్స్ పరీక్షలపై ఆగ్రహంతో ఉన్నారనే విషయం తెలిసిందే.
దీంతో చేతులు కాలే వరకు వేచి చూడడం కంటే.. ముందే మేల్కొనడం మంచిదని సీఎం కేసీఆర్ భావించి నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు. నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అవసరమైతే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్సీ)ని ప్రక్షాళన చేస్తామని, నిరుద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని.. తమను నమ్మాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు..గ్రూప్స్ పరీక్షలను కూడా విపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయని దుయ్యబట్టారు. వాటి మాటలు నమ్మొద్దని నిరుద్యోగులను ఆయన పదే పదే విన్నవించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. బీఆర్ ఎస్ పార్టీ కి గ్రూప్స్ దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయని, నిరుద్యోగ యువత ఓట్లు గుండుగుత్తగా ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.