విశాఖ ఉక్కు విషయంలో మోడీ సంచలన నిర్ణయం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అది ఆ విధంగా పోరాటాలతో ఏర్పాటు అయింది.

Update: 2024-09-29 03:31 GMT

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అది ఆ విధంగా పోరాటాలతో ఏర్పాటు అయింది. అలాంటి ఉక్కు మీద నీలి నీడలు కమ్ముకుని సరిగ్గా నాలుగేళ్ళు కావస్తోంది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలని కేంద్రం దాదాపుగా డిసైడ్ అయింది అన్నది ప్రచారంలో ఉన్న మాట.

ఇది 2021 జనవరి చివరిలో జరిగిన నిర్ణయం. నాటి నుంచి ఉక్కు కార్మికులు అలుపెరగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. దాంతో పాటు ఉక్కులో వివిధ విభాగాలలో ఉద్యోగులు పదవీ విరమణ చేసినా కొత్త వారిని తీసుకోకపోవడం కార్మికుల సంఖ్యను కుదించడం, కొన్ని కీలక విభాగాలను మూసివేయడం వంటివి ఉక్కు ఇక దక్కదు అన్న భావనను కలిగించాయి.

నిజానికి విశాఖ ఉక్కు ఏనాడో ప్రైవేట్ అయ్యేది. కానీ కార్మికుల ఉద్యమమే కేంద్రం దూకుడుకి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇక మూడోసారి కూడా పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే ఉక్కు కధ కంచికి చేరేది అని కూడా అంటారు. కానీ ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతో బీజేపీ అక్కడ అధికారం అందుకుంది.

దాంతో ఇపుడు విశాఖ ఉక్కు సెంటిమెంట్ ని గౌరవించడం కేంద్రం బాధ్యతగా మారింది. దాంతో కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా ఇతర మార్గాలను ఆలోచిస్తోంది అన్నది తాజా కబురు. దీంతో ఉక్కు కార్మిక సంఘాలలో కొంత ఆశ కనిపిస్తోంది.

నిజానికి నష్టాలతో పూర్తిగా ఉన్న విశాఖ ఉక్కుని గట్టెక్కించడం ఎలా అన్నదే కేంద్రం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో కార్మిక వర్గాలు కోరుతున్నట్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసే ప్రతిపాదన పట్ల కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నార్.

అలాగే ఉక్కు పరిశ్రమకు చెందిన 1500 ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు భూమిని ఎన్ఎండీసీకి విక్రయించడం తద్వారా ఆదాయం పెంచి ఉక్కుని సాఫీగా నడిపించే మరో ప్రతిపాదన కూడా ఉందిట. ఇక ఏకంగా బ్యాంకు రుణాలను తీసుకుని ఉక్కుని గట్టెక్కించడం ఇంకో ప్రతిపాదన. ఇలా అనేకమైన ప్రత్యామ్నాయాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు

ఇవన్నీ కూడా భవిష్యత్తులో విశాఖ ఉక్కు ఎప్పటికీ నష్టపోకుండా చూడడానికే అని అంటున్నారు. అలా విశాఖ ఉక్కు పరిశ్రమకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉందని కూడా చెబుతున్నారు. దాంతో మొదటి ప్రతిపాదనగా ఉక్కు పరిశ్రమను సెయిల్ కు అప్పగించాలన్న ఆలోచన ఉందని కూడా చెబుతున్నారు.

ఇక విశాఖ ఉక్కుని సెయిల్‌లో విలీనం చేస్తే సొంత గనుల సమస్య కూడా తీరుతుంది. నష్టాలు వచ్చాయి అంటే సొంత గనులు లేకపోవడం వల్ల అని కూడా చెప్పాల్సి ఉంది.దాంతో సెయిల్ లో విలీనానికి కార్మిక లోకం మద్దతు ఇస్తోంది.ఇవన్నీ చూస్తూంటే తొందరలో విశాఖ ఉక్కు మీద శుభ వార్తనే కేంద్రం చెప్పబోతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News