మీ అబ్బాయికి ఆ ప‌ద‌వి ఎలా వ‌చ్చింది?: అమిత్‌షాకు అదిరిపోయే క్వ‌శ్చ‌న్‌

Update: 2023-07-30 23:30 GMT

పిట్ట కొంచెం కూత ఘ‌నం అనే మాట త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కుమారుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌కు స‌రిపోతుంది. రాజకీయాల్లో సీనియ‌ర్ కాక‌పోయినా.. ఆయ‌న తాజాగా సంధించిన ప్ర‌శ్న జాతీయ రాజ‌కీయాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను.. ప‌ట్టుమ‌ని మూడుప‌దులు కూడా నిండ‌ని ఉద‌య‌నిధి ఘాటు వ్యాఖ్య‌ల‌తో టార్గెట్ చేశారు. ``అమిత్ షా కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారు`` అని ఉద‌య‌నిధి ప్రశ్నించారు.

వాస్త‌వానికి ఈప్ర‌శ్న గ‌తంలోనూ తెర‌మీదికి వ‌చ్చినా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ.. తాజాగా ఉద‌య‌నిధి ఈ ప్ర‌శ్న‌ను ఇటు మీడియా, అటు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ చేయ‌డంతో జాతీయ‌స్థాయిలో ఈ ప్ర‌శ్న‌పై చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల రామేశ్వ‌రంలో ప‌ర్య‌టించిన హోం మంత్రి అమిత్‌ షాపై తమిళనాడు సీఎం కుమారుడు, ప్ర‌స్తుత‌ క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని అన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో ఉదయనిధి కూడా అదిరిపోయే క్వ‌శ్చ‌న్‌తో అమిత్ షాను ఇర‌కాటంలో ప‌డేశారు.

ఇక‌, హోం మంత్రి షా చేసిన.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్ష లతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందన్న వ్యాఖ్య‌ల‌కు కూడా ఉద‌య‌నిధి దీటుగా స్పందించారు. కేంద్రంలో మంత్రులుగా తీసుకుంటున్న‌వారిలో ఎంత‌మందిపై అవినీతి ఆరోప‌ణ‌లుఉన్నాయో. కేసులు ఉన్నాయో.. వారు స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌ను ప‌రిశీలిస్తే.. తెలుస్తుంద‌ని షాపై నిప్పులు చెరిగారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని, ప్ర‌జ‌లే త‌న‌ను కోరుకున్నార‌ని.. తానేమీ మీ కుమారుడి మాదిరిగా నామినేటెడ్ పోస్టులో వార‌స‌త్వంగా రాలేద‌ని నిప్పులు చెరిగారు.

తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్‌ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ఉద‌య‌నిధి నిల‌దీశారు. జైషా ఎన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదని నిధి లెక్క‌లు అడిగారు. అంతేకాదు.. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్యలు.. డీఎంకే ఎంపీలు త‌మ త‌మ ట్వీట్ల‌కు రీట్వీట్లు చేస్తూ... జాతీయ‌స్థాయిలో వేడి పుట్టించారు.

Tags:    

Similar News