పోలవరం ఫైల్స్ దహనం కేసు... తెరపైకి సంచలన అప్ డేట్!
అవును...ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనా కార్యాలయంలో ఫైళ్లను కాల్చేశారనే విషయం శనివారం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు తీవ్ర సంచలనంగా మారిన వేళ తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ఫైళ్లు దగ్దం అయ్యాయనే విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఫైళ్లను గుట్టుగా కాల్చేశారనే వార్తలు సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును...ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనా కార్యాలయంలో ఫైళ్లను కాల్చేశారనే విషయం శనివారం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అవన్నీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం ఫైళ్లని, వీటిని ఆఫీసు గేటు బయట సిబ్బంది కాల్చేశారని.. మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఇక ఫైళ్లు కాల్చిన ప్రాంతాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. మదనపల్లి ఘటన తర్వాత ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
ఇదే సమయంలో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి స్పందించారు. ఉన్నతాధికారులు సెలవులపై వెళ్లడంతోనే తనను ఇన్ ఛార్జ్ గా నియమించారని.. దస్త్రాల కాల్చివేతపై తనకు సమాచారం ఇవ్వలేదని.. ఆ విభాగం సూపరింటెండెంట్ కుమారిని ప్రశ్నిస్తే అవన్నీ చిత్తు కాగితాలని చెప్పారని అన్నారు. ఇదే సమయంలో ఆ ఫైళ్లపై సంతకాలు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... పోలవరం ప్రాజెక్ట్ ఆఫీసులో ఫైళ్లను కాల్చారనే విషయం వెలుగులోకి రావడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ... ఆర్డీవో శివజ్యోతి క్లారిటీ ఇచ్చారు. కొత్త బీరువాలు రావడంతో ఫైళ్లను వాటిలో సర్ధినప్పుడు రద్దును మాత్రమే బయటపడేసి కాల్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు. దాదాపు అన్నీ సంతకాలు లేని పత్రాలే అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో దగ్ధమైన ఫైల్స్ పోలవరం ఎడమ కాలువ పరిహారానికి సంబంధించినవి కావని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ క్లారిటీ ఇచ్చారు. తగులబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివని ఆమె స్పష్టం చేశారు. దీంతో... ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు.