గన్నవరం నుంచి వంశీ ఔట్!.. వైసీపీకి త్వరలో బడా నేత?

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారా? అంటే ఆ పార్టీ పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

Update: 2025-02-10 08:30 GMT

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారా? అంటే ఆ పార్టీ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. వంశీ స్థానంలో పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఓ బడా నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ పరిశీలనలో ఉన్న ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. గన్నవరం కాబోయే ఇన్ చార్జి ద్వారా వైసీపీకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ పూర్తిగా నియోజకవర్గానికి దూరమైపోయారు. మరోవైపు ఆయన టార్గెట్ గా కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా వంశీతోపాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తోంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించిన వంశీ.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన అనుచరులను వరుసగా అరెస్టులు చేస్తున్నా, ఆయన ప్రశ్నించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉంటే తనను కూడా అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉందనే అనుమానంతో ఆయన ఏకంగా అమెరికాకు మకాం మార్చారని అంటున్నారు.

వంశీ స్థానికంగా అందుబాటులో లేకపోవడం, అరెస్టుల వల్ల వైసీపీ క్యాడర్ చల్లా చెదరవుతోందని ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. వంశీ స్థానంలో ఆ పార్టీలో వేరొకరికి బాధ్యతలు అప్పగిద్దామన్నా, సరైన నాయకుడు ప్రస్తుతం అందుబాటులో లేనట్లు భావిస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి సమర్థుడైన నేత కోసం ఎదురుచూసింది. ఇదే సమయంలో ఓ ఫైర్ బ్రాండ్ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూసిన ఆ నేతకు చివరి నిమిషంలో చాన్స్ మిస్ అయింది. దీంతో పోటీకి దూరంగా ఉండిపోవాల్సివుంది. కానీ, తన విశేష రాజకీయ అనుభవంతో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేయాలని ఆ నేత కోరుకుంటున్నారు. ఇందుకోసం సరైన వేదిక కోసం చూస్తున్నారని అంటున్నారు. అధికార టీడీపీలో స్కోప్ లేకపోవడంతో ప్రతిపక్షంపై ఆ నేత దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

వంశీ అందుబాటులో లేకపోవడం, రాజకీయాలపై ఆయన విముఖంగా ఉండటంతో వైసీపీ కూడా కొత్త ఇన్ చార్జి కోసం వెతుకుతుండటంతో ఆ నేత ఫ్యాన్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గన్నవరంలో ఓ సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అదేవర్గం నేత కావడంతో వైసీపీ కూడా వంశీకి సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తోందని చెబుతున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే గన్నవరం కొత్త ఇన్ చార్జిగా ఆ నేత రానున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి నేతలు వలసలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ నుంచి సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకోగా, ఆయన తర్వాత పీసీసీ మాజీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీని చేర్చుకునేలా చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయాలని పద్మశ్రీ భావించారు. అయితే ఆమె ప్రయత్నాలకు పీసీసీ చీఫ్ షర్మిల గండికొట్టారు. దీంతో పార్టీపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పద్మశ్రీ దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా షర్మిలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పద్మశ్రీని చేర్చుకోడానికి వైసీపీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పద్మశ్రీ ద్వారా గన్నవరం నియోజకవర్గానికి సమర్థురాలైన మహిళా నేత లభించడంతోపాటు తనపై విమర్శలతో విరుచుకుపడుతున్న చెల్లెలు షర్మిలకు చెక్ చెప్పొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వన్ షాట్ టు బర్డ్ అన్నట్లు పద్మశ్రీ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉండటంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ అధినేత జగన్ జిల్లా నాయకులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News