వంశీకి ఉతుకుడేనా.. సిట్ ఏర్పాటుకు కారణమేంటి?

మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో వంశీ బాధితులమంటూ పలువురు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.

Update: 2025-02-25 06:12 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రభుత్వం తేలిగ్గా వదిలే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీపై మరిన్ని కేసులు నమోదు చేయడంతో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వంశీ, ఆయన అనుచరుల దందాలను తవ్వి తీసేందుకు ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో వంశీ బాధితులమంటూ పలువురు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.

వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రభుత్వం వరుస షాకిలిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో మట్టి, ఇసుక మైనింగ్ ద్వారా వంశీ, ఆయన అనుచరులు కలిసి రూ,195 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీనిపై దర్యప్తునకు ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో వంశీని అన్నివిధాలా ఇరికించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. పక్కా ఆధారాలు సేకరించి వంశీకి ఉచ్చు బిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారం నోరుపారేసుకున్న వంశీకి నిజమైన పవర్ ఎలా ఉంటుందో చూపించాలనే పట్టుదల ప్రభుత్వంలో కనిపిస్తోందంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఇష్టారాజ్యంగా కొండలను తవ్వేశారని వంశీపై విజిలెన్స్ నివేదిక సమర్పించింది. అనుచరులతో పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని అక్రమ దందాలకు పాల్పడ్డారని, కేవలం పానకాల చెరువు నుంచి రూ.100 కోట్ల విలువైన మట్టిని తవ్వించారని నివేదిక రెడీ చేసింది. ఇవికాక బెదిరింపులు, ఇతర అరాచకాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. సిట్ ఏర్పాటు తర్వాత కూడా ఆయనపై రూ.10 కోట్ల విలువైన భూ కబ్జాపై ఫిర్యాదు అందింది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో విలువైన స్థలం కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతా మహాలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తం ఎపిసోడ్ పరిశీలిస్తే వంశీని కష్టాలు చుట్టుముట్టినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని వేర్వేరు కేసుల్లో అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అన్ని కేసుల్లోనూ ఆయన బెయిల్ తెచ్చుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి నోటితో విరుచుకుపడిన వంశీ పరిస్థితి దయనీయంగా మారిందన అంటున్నారు.

Tags:    

Similar News