వారాహి దారి తప్పిందా? లక్ష్యం చేరని యాత్ర
జనసేన లోని ఓవర్గం మాత్రం ఇదే మాట చెబుతోంది. వారాహి దారి తప్పేసిందని అంటున్నారు సీనియర్లు
మీరు ఔనన్నా.. కాదన్నా.. పవన్ అభిమానులమ ని గుండెలు బాదుకున్నా.. జనసేన లోని ఓవర్గం మాత్రం ఇదే మాట చెబుతోంది. వారాహి దారి తప్పేసిందని అంటున్నారు సీనియర్లు. "ఇది ఎన్నికల సమయం. ప్రజల కు చేరువకావాల్సిన సమయం. ఒంటరిగానా.. పొత్తులతోనా.. అనేది తర్వాత. ముందు పార్టీ పై నమ్మకం ఏర్పడితే.. ఎలా వెళ్లినాఫలితం ఉంటుంది. కానీ, ఇప్పుడు పార్టీ లక్ష్యాల కన్నా వివాదాలకే ప్రాధా న్యం ఇస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు" అని జనసేన నాయకులు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.
వివాదాల కు తాను దూరం అంటూనే పవన్ కళ్యాణ్.. వివాదాల కు తెరదీశారనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. "కాకినాడ లో అంత రచ్చ ఎందుకు? వైసీపీ నాయకుల గురించి.. అంతగా మేం బాధపడితే.. గతం లో ఉన్న పరిస్థితుల ను తెరమీదికి తెచ్చి.. వైసీపీ యాగీ చేసింది. దీనికి మేం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది" అని మరికొందరు జనసేన సీనియర్లు వ్యాఖ్యానించారు. వారాహి యాత్ర ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని అనుకున్నామని అంటున్నారు.
అయితే.. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి 1.0, 2.0లు కేవలం వైసీపీ పై దండయాత్రకు వచ్చినట్టుగా ఉందని మెజారిటీ జనసేన నేతలు లోలోన మథన పడుతున్నారు. అలాగని వారు వైసీపీని టార్గెట్ చేయొద్దని చెప్పడం లేదు. కానీ, క్షేత్రస్థాయి లో ప్రజల కు బలం చేకూరేలా.. పార్టీ పై నమ్మకం కలిగేలా వ్యవహరించి ఉంటే.. ఈయాత్ర సఫలం అయ్యేదని అంటున్నారు.
"మచిలీపట్నంలో గతం లో సభ పెట్టాం. ఐదారు లక్షల మంది వచ్చిన మాట వాస్తవమే. కానీ, ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. జెండా ఎగరడం లేదు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి" అని మరికొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. జనసేన నేతలు అసంతృప్తి లోనే ఉన్నారనేది వాస్తవంగా కనిపిస్తున్న విషయం. అంతేకాదు.. వారాహి యాత్ర ద్వారా ప్రత్యేకంగా పార్టీ సంపాయించుకున్న ఇమేజ్, సింపతీ ఏమీలేదని చెబుతున్నారు. పైగా.. రెండో సారి చేపట్టి వారాహి యాత్ర 2.0 పూర్తిగా దారి తప్పేసిందని అంటున్నారు. సునిశితమైన వలంటీర్ల వ్యవస్థ పై చేసిన కామెంట్లు, సీఐ అంజూ యాదవ్ చుట్టూ తిరిగిన రాజకీయం వంటివి.. యాత్ర ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేశాయని వారు వాపోతున్నారు. మరి పవన్ వీరి గోడు వింటారో లేదో చూడాలి.