పిఠాపురంలో వర్మ... టీడీపీకి మరింత జాగ్రత్త అవసరమా?
అవును... పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ తాను పోటీచేయబోయే నియోజకవర్గం పిఠాపురం అని ప్రకటించడం కంటే... అతని ప్రకటన అనంతరం స్థానిక టీడీపీ కేడర్ ఇచ్చిన రియాక్షన్, చేసిన రచ్చ, ఆ సమయంలో మీడియాతో వర్మ రియాక్షన్ మరింత చర్చనీయాంశం అయ్యింది! మరోపక్క... పైకి తన మద్దతు పవన్ కి ఉంటుందని అంటున్నా.. ఆఫ్ ది రికార్డ్ చేస్తున్నారంటూ తెరపైకి వస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కూటమికి పెద్ద సమస్యగా మారింది!
అవును... పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా... తనను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓటుకు పదివేలు, కుటుంబానికి లక్ష ఇచ్చి తనను ఓడించేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అయినప్పటికీ కేవలం గెలుపు కాదు.. లక్ష మెజారిటీతో భారీ విజయం సాధించాలని అన్నారు.
మరోపక్క టార్గెట్ పిఠాపురం అనే అంశం ఇప్పుడు వైసీపీలో కీలక అంశంగా మారింది. పిఠాపురంపై జగన్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారని.. పిఠాపురంలో పవన్ ని అష్టదిగ్భందనం చేసే దిశగా పావులు కదుపుతున్నారని.. కాపు ఓటు బ్యాంక్ లో చీలికే లక్ష్యంగా పథకాలు రచిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లతో పాటు పవన్ ని ఓడించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు టీడీపీలోని వర్మతో సరికొత్త సమస్య వస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో తాను లోక్ సభకు పోటీ చేయాల్సి వస్తే... తాను కాకినాడ నుంచి, ఉదయ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు! దీనిపై స్పందించిన వర్మ... పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే కచ్చితంగా తాను పోటీ చేస్తానని లైన్ లోకి వచ్చారు! దీంతో... పొత్తులో భాగంగా పిఠాపురం టిక్కెట్ లో ఎవరు పోటీ చేసినా అది జనసేనదే అనే విషయంలో వర్మ తగ్గడం లేదని.. పవన్ అయితే ఓకే కానీ, మరెవరైనా తాను రంగంలోకి దిగడం ఖాయమని చెబుతున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే... బ్రతిమాలుకుంటేనే పవన్ కు పిఠాపురం టిక్కెట్ ఇచ్చింది టీడీపీయేనని.. పవన్ గెలిచినా కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేయాల్సిందే అంటూ వర్మ చెప్పినట్లు మీడియాలో కథనాలు దర్శనమిచ్చాయి. దీంతో లైన్ లోకి వచ్చిన వైసీపీ... పిఠాపురంలో పవన్ ని ఓడించే విషయంలో ముందు లైన్ లో ఉండేది చంద్రబాబే అన్నట్లుగా ట్వీట్ చేసింది! దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చ రచ్చగా మారింది.
దీంతో... పిఠాపురం టిక్కెట్ విషయంలో వర్మను టీడీపీ మరింత కంట్రోల్ చేయాలని అంటున్నారు జనసైనికులు అని తెలుస్తుంది! ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేస్తున్న తనకు, అవసరమైతే ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా ఉన్న తనకు, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా పిఠాపురాన్ని జనసేనకు కేటాయించడంపై వర్మలో అసహనం అంత ఈజీగా పోదని చెబుతున్నారు పరిశీలకులు! ఈ విషయంలో వర్మ విషయంలో మరింత జాగ్రత్తలు, మరింత కంట్రోల్ చేయడం అవసరమని చెబుతున్నారు!
మరోపక్క.. పవన్ కల్యాణ్ టిక్కెట్ విషయంలో తాను అన్నట్లుగా మీడియాలో వస్తున్న కథనాలను వర్మ ఖండించనూ లేదు! దీంతో... ఆయన నిజంగానే ఆ కామెంట్లు చేశారనే చర్చ జనాల్లో మొదలైపోయింది. దీంతో... ఆ మీడియాలో వచ్చే అబద్ధాలను ఎవరూ నమ్మరంటూ ఎదురు దాడికి దిగుతుంది టీడీపీ!! ఏది ఏమైనా... ఆన్ ద రికార్డ్ అయినా, ఆఫ్ ది రికార్డ్ అయినా వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత కాలం పవన్ కు టెన్షన్ తప్పదని చెబుతున్నారు!!