ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె!
2004లో అక్టోబర్ 18న ప్రత్యేక పోలీసు దళాలు ఈ పేరుమోసిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను కాల్చిచంపడంతో అతడి హవా ముగిసింది.
వీరప్పన్ గురించి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎర్ర చందనం, ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో కొన్ని దశాబ్దాలపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను ఈ గంధపు చెక్కల స్మగ్లర్ గడగడలాడించాడు. ఎంతోమంది పోలీసులు, అటవీ సిబ్బంది అతడి దాడికి బలయ్యారు. వీరిలో తెలుగు ఐఎఫ్‌ఎస్ అధికారి, రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ ను అత్యంత కిరాతకంగా వీరప్పన్ హతమార్చాడు. 2004లో అక్టోబర్ 18న ప్రత్యేక పోలీసు దళాలు ఈ పేరుమోసిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను కాల్చిచంపడంతో అతడి హవా ముగిసింది.
కాగా వీరప్పన్ కు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు విద్యారాణి. వృత్తిరీత్యా ఈమె న్యాయవాది. 2020లో జూలైలో విద్యారాణి బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడు ఆమె బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు విద్యారాణికి కృష్ణగిరి ఎంపీ సీటును సీమాన్ కేటాయించారు. ఏప్రిల్ 19న తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు స్థానం కలిపి మొత్తం 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) పార్టీ తరఫున వీరప్పన్ కూతురు విద్యారాణి పోటీ చేయనున్నారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను సీమాన్ ప్రకటించారు.
కాగా ప్రస్తుతం వీరప్పన్ కుమార్తె విద్యారాణి కృష్ణగిరిలో ఒక చిన్న పిల్లల పాఠశాలను నడుపుతున్నారు. కృష్ణగిరి, బెంగళూరులతో ఆమెకు అవినాభావ సంబంధం ఉంది. బెంగళూరులోనే ఆమె ఐదేళ్ల లా కోర్సును అభ్యసించారు.
కాగా విద్యారాణి తన జీవితకాలంలో ఒకే ఒక్కసారి వీరప్పన్ ను కలిశారు. అది కూడా ఆమె మూడో తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు–కర్ణాటక సరిహద్దుల్లోని గోపీనాథమ్ లో తన తాతయ్య ఇంట్లో తండ్రి వీరప్పన్ ను కలిశారు. దాదాపు 30 నిమిషాల సమయం మాత్రమే తన తండ్రి వీరప్పన్ తనతో మాట్లాడారని.. బాగా చదువుకుని డాక్టర్ కావాలని కోరుకున్నారని వెల్లడించారు. డాక్టరై పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని తన తండ్రి వీరప్పన్ తనకు సూచించారని విద్యారాణి గతంలో తెలిపారు. తన తండ్రిని కలవడం తాను అదే మొదటిసారి, చివరిసారని వెల్లడించారు.