గన్ను పెట్టి నన్ను బెదిరించారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

'నీకు బతుకు మీద ఆశ లేదా.. నీకు భార్యా పిల్లలు లేరా.. పార్టీ మారి ఇబ్బందులు ఎందుకు తెచ్చుకుంటావ్' అని కేటీఆర్ ప్రభాకర్‌రావుతో బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-15 05:38 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్రను పూర్తిగా బయటపెట్టేశారు. లగచర్ల ఘటనపైనా కేటీఆర్ పాత్రపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.

ఫోన్ ట్యాపింగ్‌కు ఆద్యుడు కేటీఆరేనని, ఆయన దుర్మార్గాలను బయటపెడుతానని వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ చేసిన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు కూడా కేటీఆర్ ఉండలేడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది, చేయించింది కేటీఆరేనని ఫైర్ అయ్యారు. కేటీఆరే దొంగచాటుగా ఫోన్ సంభాషణలు విన్నాడని ఆరోపించారు. ఈ కేసుతో చిరుమర్తి లింగయ్యకు సంబంధం లేదని చెప్పారు. పాపాలు, దుర్మార్గాలు చేసిన కేటీఆర్.. ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారని, వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు చందంగా కేటీఆర్ వైఖరి ఉందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అప్పట్లో తనను పిలిచి టేబుల్ పై రివాల్వర్ పెట్టి బెదిరించారని, వార్నింగ్ ఇచ్చాడని వేముల వీరేశం ఆరోపించారు. 'నీకు బతుకు మీద ఆశ లేదా.. నీకు భార్యా పిల్లలు లేరా.. పార్టీ మారి ఇబ్బందులు ఎందుకు తెచ్చుకుంటావ్' అని కేటీఆర్ ప్రభాకర్‌రావుతో బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు తాను దళితుడిననే విషయం కేటీఆర్‌కు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లోకి పోయి ఎందుకు సమస్యలు తెచ్చుకుంటావని కేటీఆర్ సైతం తనను బెదిరించారని వీరేశం చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన 1300 మంది దళితులను నాడు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు డీటీసీలో చిత్రహింసలు పెట్టారని, ఇప్పటికీ వారు నడవలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అడ్డు పెట్టుకొని కేటీఆర్ లగచర్ల కుట్ర చేశారని వేముల ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ నీచంగా కుట్రలు చేస్తున్నారని, అధికారులను అంతమొందించేందుకు కూడా తెగించారని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసిందని ఆరోపించారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని క్షమించబోదని, అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్లలోనే జరగాలా అని నిలదీశారు.

Tags:    

Similar News