వెంకయ్య పుట్టిన రోజు.. 'ఎమర్జెన్సీని' వదిలి పెట్టని మోడీ !
మాజీ ఉప రాష్ట్రపతి.. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన ముప్పవరపు వెంకయ్యనాయుడు పుట్టిన రోజు రేపు(జూలై 1)
మాజీ ఉప రాష్ట్రపతి.. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన ముప్పవరపు వెంకయ్యనాయుడు పుట్టిన రోజు రేపు(జూలై 1). అయితే.. ఒక రోజు ముందుగానే ఆదివారం ఈ వేడుకలను హైదరాబాద్‌లోని ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో కూడిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. 'పంచ సప్తతి' పేరుతో 75 వసంతాల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.
వెంకయ్య నాయుడు.. ఏ లైప్ ఇన్ సర్వీస్, సెలబ్రేటింగ్ భారత్ ఆంగ్ల పుస్తకాలతోపాటు.... 'మహానేత వెంకయ్యనాయుడు' శీర్షికతో రూపొందించిన మరో తెలుగు పుస్తకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడు తన జీవితంలో అసాధారణ విజయాలు సాధించార ని తెలిపారు. ఈ 75 ఏళ్లు అద్భుతమైన మైలురాళ్లుగా అభివర్ణించారు. ఈరోజు ఆయన జీవిత చరిత్రతో పాటు మరో 2 పుస్తకాలను ఆవిష్కరించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ పుస్తకాలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని, దేశసేవకు సరైన దిశను చూపుతాయని నమ్ముతున్నట్టు మోడీ తెలిపారు. వెంకయ్యనాయుడుతో కలిసి చాలా కాలం పని చేసే అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా, ప్రభుత్వంలో సీనియర్ క్యాబినెట్ సహచరుడిగా, దేశ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఆయన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో వెంకయ్యనాయుడి పాత్ర ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు.
అయితే.. ఎమర్జెన్సీ కాలాన్ని మాత్రం మోడీ వదిలి పెట్టకపోవడం గమనార్హం. పార్లమెంటు ప్రారంభం నుంచి గతంలో 1975లో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంలోనూ.. స్పీకర్ ప్రసంగంలోనూ.. ప్రధాని ప్రసంగంలోనూ ఎమర్జెన్సీ కాలం నాటి అనుభవాలను పార్లమెంటులో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా వెంకయ్య పుట్టిన రోజు వేడుకలోనూ దీనిని ప్రస్తావించారు. ఎమర్జెన్సీ కాలంలో వెంకయ్య కూడా జైలుకు వెళ్లారని.. అలాంటి రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.