వెంకయ్య వ్యాఖ్యల కలకలం.. చంద్రబాబు పాటిస్తారా మరి?

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

Update: 2024-08-12 11:30 GMT

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన తన చిన్ననాటి స్నేహితులను కలుస్తూ వస్తున్నారు. అలాగే తమ కుటుంబం ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు సేవలపై దృష్టి సారించారు. అలాగే వివిధ పాఠశాలలు, కళాశాలల వార్షికోత్సవాలకు హాజరవుతూ విద్యార్థులకు వివిధ అంశాలపై విలువైన సూచనలు చేస్తున్నారు.

తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై చర్చ జరుగుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ప్రజలకు వైద్యం, చదువు ఉచితంగా అందిస్తే సరిపోతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. మిగతావి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఉచితంగా పథకాలను ఇవ్వడానికి బదులు వారికి పనిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాలకు సూచించారు. తద్వారా ప్రజలకు వివిధ పనుల్లో ఉపాధి దొరుకుతుందన్నారు. వారి జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పారు. అప్పుడే దేశం, రాష్ట్రాలు బాగుపడతాయని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం వైసీపీ.. కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇవ్వాల్సిందేనని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ఉచిత పథకాలపైనే కాకుండా వివిధ అంశాలపైన వెంకయ్య నాయుడు తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. పోలీసు స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలపై పెత్తనం చేయడం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ప్రజా జీవితంలో బూతులు మాట్లాడవద్దని కోరారు. బూతులు మాట్లాడేవారికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూశామన్నారు. చట్ట సభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష మాట్లాడాలన్నారు.

ప్రజా జీవితంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదన్నారు. కేవలం ప్రత్యర్థులం మాత్రమేనన్నారు. సిద్ధాంతాలు, విలువలు, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. రాజ్యసభలో సైతం ఉపరాష్ట్రపతిని ధిక్కరించేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య పెరిగానని వెంకయ్య నాయుడు తెలిపారు. తన చిన్నప్పుడే తన తల్లి మరణించిందని.. తన జీవితంలో ఇదొక్కటే వెలితి అని చెప్పారు. ఇది తప్ప తనకు మరే అసంతృప్తి లేదని వివరించారు.

తాను తన తల్లి ఆలోచనలకు అనుగుణంగా లా చదివానని చెప్పారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలు కావడంతో లా ప్రాక్టీస్‌ చేయలేకపోయానని తెలిపారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం.. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటుందా, లేదా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్నో హామీలను టీడీపీ ఇచ్చింది. అలాగే జనసేన పార్టీ సైతం కొన్ని హామీలను ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు అధికారంలో ఉండటంతో ఉచిత పథకాల అమలు విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News