హోం మంత్రి ఇలాకాలో వైసీపీ ఇంచార్జిగా సినీ నిర్మాత ?
అదే విధంగా శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులుని తెచ్చి పాయకరావు పేట నుంచి 2024లో పోటీ చేయించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఇంచార్జిని వైసీపీ ఇంకా నియామకం చేయలేదు. అక్కడ 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన గొల్ల బాబూరావుని రాజ్యసభకు ఎంపీగా పంపించారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులుని తెచ్చి పాయకరావు పేట నుంచి 2024లో పోటీ చేయించారు.
అయితే టీడీపీ కూటమి ప్రభంజనానికి పాయకరావుపేటలో భారీ ఓటమిని వైసీపీ అందుకుంది. ఆ తరువాత కంబాల జోగులు కూడా పేట వైపు కన్నెత్తి చూడలేదు. ఆయన సొంత నియోజకవర్గం రాజాం కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక పాయకరావుపేట వైసీపీ ఇంచార్జి ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది.
ఇదిలా ఉంటే రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు తన వారసులను ఇంచార్జిగా చేయమని కోరుతున్నారు. తన తరువాత రాజకీయం కూడా వారు చేయాలని ఆయన ఆశపడుతున్నారు. 2030 మార్చి వరకూ బాబూరావు రాజ్యసభ పదవీకాలం ఉంటుంది. దాంతో ఆయన పాయకరావుపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన అనుభవాన్ని రాజకీయాన్ని వారసులకు పంచాలని చూస్తున్నారు.
కానీ వైసీపీ అధినాయకత్వం ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని అంటున్నారు. బాబూరావుకు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి అమలాపురం ఎంపీగా టికెట్లు ఇచ్చామని రాజ్యసభకు కూడా ఆయనను పంపించి భారీ నజరానా ఇచ్చామని అందువల్ల అక్కడ వేరే వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
పాయకరావు పేటలో 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చెంగల వెంకటరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన బాలక్రిష్ణతో సమరసింహా రెడ్డి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తరువాత మరిన్ని సినిమాలు తీశారు. ఇపుడు ఆయన వైసీపీ నుంచి పాయకరావు పేట ఇంచార్జ్ పదవిని ఆశిస్తున్నారు.
ఆయన ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలకడం ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. చెంగల వెంకటరావుని ఇంచార్జిగా చేస్తారా అన్నది ఇపుడు వైసీపీలో కొత్త చర్చ సాగుతోంది. అయితే గొల్ల బాబూరావు నిన్నటిదాకా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, స్థానికంగా పట్టు ఉంది. దాంతో ఆయన సమ్మతిస్తేనే ఏదైనా సాధ్యమని అంటున్నారు. అయితే వైసీపీ హై కమాండ్ తలచుకుంటే ఎవరికైనా బాధ్యతలు దక్కుతాయని అంటున్నారు. దాంతో చెంగలకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే హోం మంత్రి అనిత నియోజకవర్గంలో వైసీపీ పట్టుని నిరూపించుకునేందుకు సాధ్యమైనంత తొందరలో ఇంచార్జిని పెట్టి పార్టీ యాక్టివిటీని పెంచాలని అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు.