రాముడులాంటి కాంగ్రెస్ కు ‘హనుమంతుడైన’ ఆయనకు అన్యాయం జరిగిందట!

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హల్ చల్ చేసే వీహెచ్.. అధిష్ఠానానికి నమ్మిన బంటు.

Update: 2024-07-10 15:30 GMT

ఆయనకు ప్రజాబలం లేకపోవచ్చు.. కానీ అధిష్ఠానంలో అండ దండిగా ఉంది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు.. ప్రజా సమస్యలపై స్పందించే గుణం ఉంది.. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు.. కానీ, ముఖ్య నేతగా మాత్రం తీసివేయలేరు. మొత్తానికి కాంగ్రెస్ రాముడైతే.. ఆయన హనుమంతుడు. పొడిగా చెప్పాలంటే వీహెచ్. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు.. రెండుసార్లు ఎమ్మెల్యే.. 35 ఏళ్ల కిందటే పీసీసీ అధ్యక్షుడు.. ఇవీ ఆయన రికార్డులు. వాస్తవానికి వైఎస్, చంద్రబాబుతో పాటే 1978 ఎన్నికల్లో వీహెచ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ, రాజకీయంగా వారి స్థాయికి ఎదగలేకపోయారు. మరీ ముఖ్యంగా ముందుగా కాంగ్రెస్ అగ్ర నేతలు సంజయ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీలు ఆకస్మికంగా చనిపోవడం వీహెచ్ రాజకీయ జీవితాన్ని దెబ్బకొట్టింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయసున్న ఆయన ఇటీవల ఖమ్మం ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

8 ఏళ్లుగా పదవిలో లేను..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హల్ చల్ చేసే వీహెచ్.. అధిష్ఠానానికి నమ్మిన బంటు. అందుకే మూడుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 2016లో చివరిసారిగా ఆయన పదవీ కాలం పూర్తయింది. ఆ తర్వాత నుంచి మళ్లీ చాన్స్ రాలేదు. పైగా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో వీహెచ్ కు ఏ పదవీ దక్కలేదు. అందుకే గత ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ దక్కలేదని.. రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని తాజాగా కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చి ఉంటే గెలిచేవాడినని వ్యాఖ్యానించారు. టికెట్‌ విషయంలో తనకు అన్యాయం జరిగిందని.. తెలంగాణ పర్యటనకు వస్తున్న కురియన్‌ కమిటీ తొలుత ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలును కలవాలని సూచించారు.

సికింద్రాబాద్ కు దరఖాస్తు చేయలేదుగా..

వీహెచ్ ఖమ్మం టికెట్ కు దరఖాస్తు చేశారు. కానీ, సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి ఉంటే గెలుస్తానని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూ అభ్యర్థులను వడపోసి ఎంపిక చేస్తోంది. అలాంటప్పుడు వీహెచ్ కు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం ఎలా? కాగా, వీహెచ్ స్థాయి సీనియర్ లీడర్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ లేరు. అంతేకాక అధిష్ఠానానికి నమ్మిన బంటు కావడంతో ఆయనకు ఏదైనా పదవి లభిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News