పోలవరం నిర్వాసితులకు పండగ

ఏడేళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా నిధులు చెల్లించింది.

Update: 2025-01-06 08:08 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఎదురుచూపులు ఫలించాయి. ఏడేళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా నిధులు చెల్లించింది. మొత్తం రూ.996.47 కోట్లను నిర్వాసితుల అకౌంట్లలో జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల్లో ఈ డబ్బు వారి అకౌంట్లలో పడనుంది.

పోలవరం నిర్వాసితులకు ఏడేళ్లుగా నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో గోదావరి వరదల్లో మునుగుతూ నానా ఇబ్బందులు పడుతూనే నిర్వాసితులు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం నిర్వాసితుల పైసా కూడా చెల్లించలేదు. దీంతో నిర్వాసితులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఇక కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ముందుగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని భావించింది. దీంతో వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను చెల్లించింది. పునరావసం నిమిత్తం రూ.586.71 కోట్లు, భూ సేకరణకు రూ.235.23 కోట్లు, నిర్మాణ పనులకు రూ.174.53 కోట్లు కేటాయించింది. ఈ డబ్బు రెండు రోజుల్లో నిర్వాసితుల అకౌంట్లలో జమ కానున్నాయి. నిర్వాసిత పునరావాస కాలనీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ముందుగా ముంపు గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఈ గ్రామాల్లో పునరావాస ప్యాకేజీ గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు, గిరిజనులు, ఎస్సీలకు రూ.6.86 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇవికాక వారి భూములు ముంపులో చిక్కుకుంటే వాటికీ పరిహారమిచ్చి సేకరిస్తున్నారు. ఇంటి స్థలం, నిర్మాణం అవసరం లేదనుకున్న నిర్వాసితులకు మొత్తం రూ.3.85 లక్షలు చెల్లిస్తున్నారు. ఇంటి స్థలం కోరుకుని తామే కట్టుకుంటామన్న వారికి రూ.2.85 లక్షలిస్తోంది. పునరావాస కాలనీలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇంటికి వెళ్లే వారికి ఇవేవీ వర్తించవు.

పునరావాస ప్యాకేజీ దాదాపు 5 వేల కుటుంబాలకు దక్కినట్లు చెబుతున్నారు. పోలవరంలో మొదటి విడత కింద 20,946 కుటుంబాలు, రెండో విడతలో రూ.17,114 కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుటుంబాల్లో 7,480 మంది సొంతంగా ఇళ్ల నిర్మించుకుంటామని ప్రభుత్వానికి నివేదించారు. కాగా, పోలవరంలో మిగిలిన పనుల కోసం కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు కేటాయించింది. ఇప్పుడు చెల్లించిన రూ.996.47 కోట్లు కాకుండా, ఇంకా రూ.2,478 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నిర్వాసితులకు రూ.996 కోట్లు చెల్లించడంతో మిగిలిన మొత్తం కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

Tags:    

Similar News