కక్షపూరిత రాజకీయాలపై విజయ్ క్లారిటీ.. వారిపై సెటైర్స్!
ఈ సందర్భంగా సుమారు 10 నుంచి 20 కి.మీ. మేర వాహనాల బారులే కనిపించాయి.
"తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీ తొలి రాష్ట్రస్థాయి మహానాడును విళుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఆదివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు 10 నుంచి 20 కి.మీ. మేర వాహనాల బారులే కనిపించాయి.
ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ ప్రసంగంలో పలు ఆసక్తికర, కీలక, సంచలన విషయాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా... ఎంచుకున్న అంశల్లో స్పష్టత ఉండటంతో పాటు ఆ విషయాన్ని నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అంతే స్పష్టంగా చెప్పడంలోనూ విజయ్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.
అవును... టీవీకే పార్టీ తొలి రాష్ట్ర స్థాయి మహానాడులో జోసఫ్ విజయ్ ప్రసంగం ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో భాగంగా... "సమాజంలో విభజనలు సృష్టిస్తున్న ఓ సమూహం ఉంది.. వారే మనకు మొదటి శత్రువులు".. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్. తన దగ్గర సర్దుబాటు రాజకీయాలు లేదా రాజీలు ఉండవని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో... ద్రావిడ భావజాలాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకుంటూ.. తమిళనాడును కుటుంబ వ్యాపరంగా దోచుకుంటున్న వారు తమ తదుపరి ప్రత్యర్థులని అన్నారు. ప్రధానంగా... బీజేపీ తమకు సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు.
అదేవిధంగా తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. సామాజిక నిబద్ధతతోనే ప్రజాసేవలోకి వచ్చానని అన్నారు. ఇదే సమయంలో... ద్వేషపూరిత రాజకీయాలు ఉండవని, ఇక వెనక్కి తిరిగి చూడకూడదని మద్దతుదారులకు క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో... తమ సిద్ధాంత నాయకుడు తందై పెరియార్ అని.. మహిళాభ్యున్నతి, స్త్రీ విద్య, సామాజిక న్యాయం, హేతువాదం వంటి పెరియార్ సిద్ధాంతాలను కచ్చితంగా చేతుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నాదురై చెప్పినట్లు ఒకటే కులం, ఒకటే దైవం అనేది తమ వైఖరని స్పష్టం చేశారు.
న్యాయమైన పాలనకు - లౌకికవాదానికీ ఆదర్శంగా ఉన్న మాజీ సీఎం కామరాజర్ ను తమ మార్గదర్శకునిగా స్వీకరిస్తామని.. కులనిర్మూలనకు పోరాడిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను తమ మార్గదర్శకునిగా చెప్పడానికి గర్విస్తున్నామని.. బ్రిటీష్ వారిపై పోరాడిన అంజలై అమ్మాళ్, వేలునాచ్చియార్ లు తమ సిద్ధాంత నాయకులని పేర్కొన్నారు.