వైసీపీ అలర్ట్ : ఢిల్లీకి బోస్, విజయసాయిరెడ్డితో గురుమూర్తి భేటీ
ఈలోగా విజయసాయిరెడ్డితో మాట్లాడమని తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఆయన నివాసానికి పంపింది. దీంతో వైసీపీలో పరిణామాలు చకచకా మారుతున్నాయి.
తమ రాజ్యసభాపక్ష నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ అలర్ట్ అయింది. సాయిరెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీలను రంగంలోకి దింపింది. రాజీనామాపై పునరాలోచన చేయాలని విజయసాయిరెడ్డితో చర్చలు మొదలుపెట్టింది. అయితే తాను అధినేత జగన్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన తర్వాత వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు మొదలుపెట్టింది. విజయసాయితో చర్చించేందుకు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసును ఢిల్లీకి పంపింది. ఈలోగా విజయసాయిరెడ్డితో మాట్లాడమని తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఆయన నివాసానికి పంపింది. దీంతో వైసీపీలో పరిణామాలు చకచకా మారుతున్నాయి.
తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. అయితే విజయసాయి ఉప రాష్ట్రపతిని కలవడానికి ముందే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆయన నివాసానికి వచ్చారు. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనతో తాను షాక్ అయ్యాయని, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా వచ్చానంటూ మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా జగనన్ను మళ్లీ సీఎం చేద్దామని, అంతవరకు రాజకీయాల్లో కొనసాగమని విజయసాయిరెడ్డిని ఎంపీ గురుమూర్తి కోరారు. దానిపై ఆలోచిద్దామంటూ విజయసాయిరెడ్డి చెప్పారని గురుమూర్తి తెలిపారు.
మరోవైపు వ్యాపారపరమైన ఒత్తిడి ఎక్కువ అవడం వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు భావిస్తున్న పార్టీ అధిష్ఠానం ఆయనతో చర్చించమని సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన వెంటనే ఢిల్లీ బయలుదేరారు. ఒత్తిడి వల్లే విజయసాయిరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీ బయలుదేరే ముందు బోస్ వ్యాఖ్యానించారు.
ఇక విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. ‘‘జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా ఇది, జగన్ కి తెలిసే అంతా జరుగుతోంది. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా.. చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మేంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు. విజయసాయి రెడ్డి చంద్రబాబుని అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉంది. చేసినవన్నీ చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటే కుదరదు.. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలి. విజయసాయి రెడ్డి దేశం విడిచి వెళ్ళడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదు’’ అంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి అన్న మాటలను చంద్రబాబు కుటుంబం మర్చిపోయినా తాను మరచిపోనని, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎవరు క్షమించినా నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు.