వైసీపీ సంక్షోభం..టీడీపీకి కాదు అనుకూలం ?
అంటే వైసీపీని టార్గెట్ చేసింది ఇక్కడ బీజేపీ అని అర్ధం అవుతోంది. బీజేపీకి రాజ్యసభలో బలం పెరగాలి. ఆ పార్టీకి కీలకమైన బిల్లులు అక్కడ ఆమోదం పొందాలి.
వైసీపీలో పెను రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఉన్నట్లుండి వైసీపీలో నంబర్ టూగా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ అయిన వి విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అది కూడా మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగా ఆయన ఈ పని చేయడం అంటే రాజకీయం పట్ల ఆ మాత్రం ఈ మాత్రం ఆసక్తి ఉన్న వారికే షాక్ ని తినిపించించి.
ఒక్క రోజు పదవి కోసం ఎంతగా రాజకీయ యుద్ధాలు జరుగుతాయో అందరికీ తెలిసిందే. అలాంటిది పెద్దల సభలో కీలకమైన పదవిని రాజీయామా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా ఊరికే ఎవరైనా చేస్తారు అనుకున్నా అది కూడా ఆలోచనలకు అందని విషయమే. దీని వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నదే రాజకీయ విశ్లేషకులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్న విషయంగా ఉంది.
పైగా ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలో పడబోతోంది అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు వైసీపీ ఎంపీగా ఉన్న ఆర్ క్రిష్ణయ్య చేసిన రాజీనామాతో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని ఆ సీటు తమ పరం చేసుకున్నారు. ఇపుడు రెండవ సీటు కూడా కమలం ఖాతాలో పడబోతోంది.
అంటే వైసీపీని టార్గెట్ చేసింది ఇక్కడ బీజేపీ అని అర్ధం అవుతోంది. బీజేపీకి రాజ్యసభలో బలం పెరగాలి. ఆ పార్టీకి కీలకమైన బిల్లులు అక్కడ ఆమోదం పొందాలి. అందువల్ల ఈ విధంగా వైసీపీకి గురి పెట్టింది అని అంటున్నారు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి.
ఈసారి జమిలి ఎన్నికల బిల్లుతో పాటుగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటివి కీలకమైన వాటిని బీజేపీ ఆమోదించుకోవాల్సి ఉంది. దాంతో బీజేపీ రాజ్యసభలో మరింతగా బలపడాలని చూస్తోంది. దాంతోనే వైసీపీకి అక్కడ ఉన్న ఎంపీల మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి తన రాజీనామా వ్యక్తిగతమని చెబుతున్నా బీజేపీకే ఈ సీటు వెళ్తోంది అన్నది ప్రచారం అవుతున్న వేళ కమల వ్యూహాలు తెర వెనక భారీగా ఉన్నాయని చర్చ సాగుతోంది.
ఇక ఏపీలో చూస్తే బీజేపీ రానున్న కాలంలో విస్తరించుకోవాలని నిర్ణయించింది. దాంతో పాటు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకుని పోయే విధంగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలో ఉన్నవి మూడూ ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలన్నీ కూడా బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష చుట్టరికాన్ని కలిగి ఉన్నాయనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో చూస్తే ఏపీలో టీడీపీ నుంచి బిగ్ షాట్స్ అనదగిన ఎంపీలు బీజేపీలో చేరిపోయి ఆ పార్టీకి అండగా నిలిచారు.
ఆ తరువాత బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని చూపించుకుని కీలక బిల్లులను ఆమోదించుకుంది. దానికి నాటి వైసీపీ ప్రభుత్వం సైతం సహకరించింది. ఇపుడు చూస్తే వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ నుంచి సహకారం ఉండదని తెలుస్తోంది. దాంతో పాటు ఏపీలో బలపడాలన్న బీజేపీ ఆకాంక్షల మధ్యనే ఆపరేషన్ వైసీపీ అన్నది జరుగుతోంది అంటున్నారు.
ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీల రాజకీయాలు వారి అనివార్యతలు పరిమితుల మధ్యలో జాతీయ పార్టీ అయిన బీజేపీ బలపడాలని చూస్తోంది అని అంటున్నారు వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడితే ఆ మేరకు టీడీపీ లాభపడాలి. కానీ ఇక్కడ బీజేపీ బలపడాలని చూస్తోంది. దాంతో విజయసాయిరెడ్డి ఏపీసోడ్ లో టీడీపీకి రాజకీయంగా అనుకూలతను ఇవ్వదని పైగా సమీప భవిష్యత్తులో బీజేపీ ఏపీలో తన రాజకీయ పట్టు గట్టిగా బిగిస్తే ఆ మేరకు టీడీపీకి కూడా ఇబ్బంది అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి ఏపీ వేదికగా కమలం రాజాకీయ ఆట మొదలెట్టింది అని అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో.