ఈ మంత్రులు కూడా వరద బాధితులే!

రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన నివాస భవనాల్లోకి నీరు ప్రవహించింది.

Update: 2024-09-02 10:05 GMT

విజయవాడలో గత వందేళ్లలో రానంత వర్షం కురియడంతో ప్రకాశం బ్యారేజీకి దాని చరిత్రలోనే రెండో అతిపెద్ద వరద ప్రవాహం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం విలవిల్లాడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్‌ అధికారుల భవనాలు, ప్రభుత్వ భవనాలు చుట్టూ నీరు చేరింది. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన నివాస భవనాల్లోకి నీరు ప్రవహించింది. విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు కూడా జలమయమయ్యాయి.

రాజధాని ప్రాంతంలో రహదారులు నీటితో నిండిపోయాయి. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపైకి వరద నీరు ప్రవహించింది. దీంతో రాజధాని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉండవల్లిలోని కృష్ణా న ది ఒడ్డున చంద్రబాబు నివాసం కూడా నీట మునిగింది. అలాగే విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఉంటున్న అప్పారావు గెస్ట్‌ హౌస్‌ కూడా నీటిలో చిక్కుకుంది.

ఇక విజయవాడలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసం కూడా వరదలో చిక్కుకుంది. విజయవాడ ఏలూరు రోడ్డులోని రామవరప్పాడు వంతెన కింద అనిత నివాసం ఉంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు పొంగి పొర్లింది. ఓవైపు బుడమేరు వరద, ఇంకోవైపు ప్రకాశం బ్యారేజీ ప్రవాహం, మరోవైపు వర్షపు నీటితో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.

హోం మంత్రి అనిత నివాసం వరదలో చిక్కుకోవడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను ట్రాక్టర్‌ పైకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. అలాగే జలదిగ్బంధంలో చిక్కుకున్న తమ కాలనీ వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడంపై అనిత అధికారులతో కలిసి దృష్టిపెట్టారు.

మరోవైపు ఉండవల్లిలోని తన నివాసం నీటమునగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని కలెక్టరేట్‌ కార్యాలయానికి ఆదివారం రాత్రే బసను మార్చారు. అక్కడ నుంచే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, సమీక్షలు చేయడం చేస్తున్నారు.

ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలోకి నీరు రాకుండా సిబ్బంది లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రంగా ఉండటంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పుంపుతున్నారు.

వరద ఉధృతి మరింత పెరుగుతుందని, ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజీకి రికార్డ్‌ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. బ్యారేజీకి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఇంకా వరద వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News