వైరల్ ఇష్యూ... గాజా కింద మరో రెండు గాజాలు!

ఇజ్రాయేల్ పై తొలిరోజు నరమేథం సృష్టించిన క్రమంలో... హమాస్‌ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు ఈ సొరంగ మార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయని చెబుతున్నారు.

Update: 2023-10-21 13:30 GMT

గాజాపై ఇజ్రాయెల్‌ బలగాల భీకర దాడులు అవిరామంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఉత్తర గాజాను ఖాళీచేయమని ప్రకటించిన ఇజ్రాయేల్ సైన్యం... ప్రస్తుతం దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ పట్టణంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. అనేక చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ సమయంలో హమాస్ చెరలో గాజాలోని సొరంగాల్లో ఉన్న బందీలను విడిపించడం మాత్రం ఇజ్రాయేల్ సైన్యానికి అంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు.

అవును... ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడానికి భుతల దాడులకు ఇజ్రాయేల్ సిద్ధపడుతోంది. అయితే అది అంత ఈజీకాదని చెబుతున్నారు. నిపుణులు అలా చెప్పడం వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్‌ వర్క్‌ హమాస్‌ కు పెట్టని కోటగా ఉందని చెబుతున్నారు.

ఇజ్రాయేల్ పై తొలిరోజు నరమేథం సృష్టించిన క్రమంలో... హమాస్‌ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు ఈ సొరంగ మార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయని చెబుతున్నారు. దీంతో... ఈ శత్రుదుర్బేధ్యమైన టన్నెల్‌ నెట్‌ వర్క్‌ ఎలా ఉంది.. ఎక్కడెక్కడ విస్తరించి ఉంది.. ఎంట్రీ, ఎగ్జిట్ వంటి విషయాలు ఇజ్రాయెల్‌ ఆర్మీకి అంతుచిక్కడం లేదని అంటున్నారు.

హమాస్ ఉగ్రవాదులకు ఇవి పెట్టని కోటలని చెబుతున్నారు. పైగా ఈ టన్నెల్స్ నెట్ వర్క్ విషయాలు ఈ ఉగ్రవాద సంస్థలోని పెద్ద తలకాయలకు మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది.. మిగిలినవారికి అంతంతమాత్రమే అవగాహన ఉంటుందని చెబుతున్నారు. దీంతో... హమాస్ లోని ఒక పెద్ద తలకాయను సజీవంగా పట్టుకుంటే ఇందుకు సంబంధించిన సమాచారం రావొచ్చని భావిస్తున్నారంట.

ఈ టన్నెళ్లలోనే హమాస్‌ ఆయుధ సామగ్రి అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌ బందీలను అండర్‌ గ్రౌండ్‌ లోనే దాచినట్లు ఆర్మీ చెబుతోంది. వాస్తవానికి ఇజ్రాయెల్‌ 2014 నుంచి గాజా స్ట్రిప్‌ తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది ఇజ్రాయేల్. ఇదే సమయంలో సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్‌ సిస్టమ్స్, రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కు బాధ్యతలు అప్పగించింది.

దీంతో... గాజాలో భూమిలోపల రెండు టన్నెల్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంఘా... గాజా భూమిలోపల హమాస్‌ రెండు టన్నెల్స్ ని నిర్మించుకుందని... అందులో ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ దని, ఆ రెండో లేయర్‌ ఎక్కడుందో కనిపెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్‌ కొన్రికస్‌ చెప్పారు.

ఇదే విషయాలపై మరింతగా స్పందిస్తున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... అండర్‌ గ్రౌండ్‌ నెట్‌ వర్క్‌ ను ఛేదించడం అంత సులువు కాదని.. ఇది అత్యంత పగడ్భందీగా నిర్మించబడిందని.. దీని ఆచూకీ, వివరాల కోసం గతంలోనూ ఇజ్రాయెల్‌ అనేక మార్లు ప్రయత్నించి భంగపడిందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఇది సుమారు 500 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ నెట్‌ వర్క్‌ అని అంటున్నారు.

ఇలా భూగర్భంలో ఉన్న రెండు టన్నెల్స్ లో హమాస్ ఉగ్రవాదులు బందీలను ఎక్కడ దాచారు అనేది కనిపెట్టడమే ఇజ్రాయేల్ సైన్యం ముందున్న అతిపెద్ద టాస్క్ అని అంటున్నారు నిపుణులు. మరి ఆరు నూరైనా నూరు ఆరైనా పోరాడే బందీలను విడిపించుకుంటుందా.. లేక, రాజీప్రయత్నంలో విడిపించుకుంటుందా అనేది వేచి చూడాలి!!

కాగా... ఇజ్రాయేల్ దాడులతో గాజాలో ఇప్పటివరకు 4,137 మంది మృతిచెందారని, 12,500 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారని పాలస్థీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోపక్క హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ లో 1,400 మందికిపైగా జనం మరణించారని, మిలిటెంట్ల అధీనంలో 203 మంది బందీలు ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News