వైసీపీలో ఆ పోస్టు అంటే హడల్.. భయపడుతున్న లీడర్లు

అయితే విశాఖ వైసీపీలో మాత్రం దీనికి రివర్స్ సీన్ నడుస్తోంది.

Update: 2025-02-19 21:30 GMT

రాజకీయ నాయకులకు పదవి ఓ అలంకారం. అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవి.. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవి కోసం నేతలు పోటీపడుతుంటారు. అయితే విశాఖ వైసీపీలో మాత్రం దీనికి రివర్స్ సీన్ నడుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని పార్టీ నేతలకు ఆఫర్ చేస్తుంటే.. అమ్మో ఆ పోస్టుకు ఓ దండం సామీ అంటూ తప్పించుకుంటున్నారట.. వైసీపీ నేతలను అంతలా భయపెట్టడానికి ఓ నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా చెబుతున్నారు.

ఫలానా పదవి కావాలంటూ నేతలు తమ పార్టీ అధిష్టానాన్ని పట్టుబట్టడం కామన్. కానీ నీకో పోస్ట్‌ ఇస్తామంటే వద్దు బాబోయ్‌ అనడం చాలా రేర్. విశాఖ వైసీపీలో ఇలాంటి సీనే కనిపిస్తోంది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటే ఏ నేత ముందుకు రావడం లేదట. నేతలు ఇంతలా వెనకడుగు వేయడానికి విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ నడుస్తోంది. ఈ పదవి చేపట్టినవారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం రివాజుగా మారిందని టాక్ ఉంది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగడం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

వైసీపీ ఆవిర్భవించిన మొదట్లో అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ మొదలుకుని, ప్రస్తుత అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వరకు ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంట్లో కూర్చోవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది. విశాఖ అర్బన్ అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు. ఆయన 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటు దక్కలేదు. మేయర్ పీఠం దక్కుతుందనుకున్నా, ఆఖరి నిమిషంలో నిరాశే మిగిలింది.

ఇక మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది సేమ్ సీన్. పెందుర్తి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆయనకు పార్టీ లాస్ట్ మినిట్‌లో ఝలక్ ఇచ్చింది. ఆయన కూడా వైసీపీని వీడి జనసేనలో చేరిపోయి పెందుర్తి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గతంలో విశాఖ నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వ్యాపార అక్రమాలు వెలుగు చూడటంతో జైలుకు వెళ్లాల్సివచ్చిందంటున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా జిల్లా అధ్యక్ష పీఠం బాధితుడే. ఆయన హయాంలో గ్రేటర్ విశాఖ పరిధిలో జోష్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి. రాజకీయంగా ఓటమి అంటే ఎరుగని అవంతికి కూడా తొలిసారి ఘోరమైన పరాభవం తప్పలేదు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు సైలెంట్‌ ఉన్న అవంతి ఇటీవలే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

అలాగే ఎప్పుడూ గెలుపు వాకిట ఓడిపోతున్న కోలా గువురులుదీ ఇదే పరిస్థితి. 2014లో వైసీపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకున్నా, ఆయనకు ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీగానైనా సరే చట్టసభలో అడుగుపెట్టాలనే కోలా గురువులు ఆశ ఒక్క ఓటుతో తేడాతో నెరవేరకుండా పోయింది. ప్రస్తుత విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యతలు కూడా ఇచ్చింది అధిష్టానం. ఆయన ఈ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉందన్న సాకుతో విశాఖ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని చూస్తున్నారు. అధినేత జగన్ కు బాగా సన్నిహితుడైన అమర్ కోరికను కాదనలేక కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో విశాఖ వైసీపీ పగ్గాలను ఎవరికి కట్టబెట్టాలనే దానిపై అధిష్టానం ఆలోచనలో పడిందని చెబుతున్నారు. అంతో ఎంతో నేమ్‌, ఫేమ్‌ ఉన్న లీడర్లు అంతా సెంటిమెంట్ భయంతో ముందుడుగు వేయడం లేదని చెబుతున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గ ఇంచార్జి కేకే రాజు పేరును కొందరు ప్రతిపాదిస్తుంటే, ఆయన కూడా సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. మళ్ల విజయ్ ప్రసాద్ కోర్టు కేసులతో జైలుకు వెళ్లి వచ్చినా సరే కొద్దిరోజులు నడిపిద్దామంటే ఆయన పరిస్థితి మరీ దయనీయంగా ఉందని అంటున్నారు. ఇక విశాఖ సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేశ్ కుమార్‌కు గతంలో టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తామంటే తన వ్యాపారాలకు కూటమి పార్టీల నుంచి ముప్పు ఉంటుందని తప్పించుకుంటున్నరని చెబుతున్నారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు కూడా తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారట. ఇలా రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ పార్టీ పగ్గాలు ఇస్తామంటే నేతలంతా సెంటిమెంటుతో సాకులు చెబుతూ వెనకడుగు వేయడం చర్చనీయాంశం అవుతోంది.

Tags:    

Similar News