విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా సినీ నిర్మాత !

ఆ జాబితాలో విశాఖ పార్లమెంట్ సీటుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా సినీ నిర్మాతను ఆ పార్టీ ప్రకటించింది.

Update: 2024-04-10 19:03 GMT

త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన కొత్త అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ తాజా జాబితాలో ఆరుగురు లోక్‌సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ప్రకటించారు. ఆ జాబితాలో విశాఖ పార్లమెంట్ సీటుకు కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్ధిగా సినీ నిర్మాతను ఆ పార్టీ ప్రకటించింది. ఈ సీటు కోసం మొదట చాలా పేర్లు అనుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామిరెడ్డిని పోటీ చేయమని కూడా కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన నో చెప్పినట్లుగా ప్రచారం సాగింది.

అలాగే వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన సీనియర్ నేత కొయ్య ప్రసాదరెడ్డి విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు. ఆయనకు సీటు దక్కలేదు. అనూహ్యంగా సినీ నిర్మాతకు దక్కింది. ఆయన పేరు పులుసు సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్యారెడ్డి. ఆయనది గంటూరు జిల్లా. కానీ చాలా కాలంగా ఆయన విశాఖలో స్థిరపడ్డారు.

ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట తెలుగుసేన పార్టీని ప్రారంభించారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆయన సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకూ 53 చిత్రాలను నిర్మించారు. అతని తాజా చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం గా ఉంది.

ఈ సినిమాను ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపధ్యంలో రూపొందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఈ చిత్రంలో స్థానిక కళాకారులు నటించారు. ఈ చిత్రంలో ఆయన ప్రధాన నటుడిగా దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత విప్లవ కళాకారుడు గద్దర్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఆ విధంగా ఆయన ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చారు.

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గట్టిగా ఉంది. దాంతో దాంతో ఎంతో కొంత సంబంధం ఉన్న వారిగా సత్యారెడ్డి పేరుని ప్రకటించారు అంటున్నారు. ఆయన మిగిలిన వారి కంటే అంగబలం అర్ధబలం కలిగిన వారిగా భావించి ఆయనను పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో కాంగ్రెస్ ప్రకటించిన మిగిలిన అభ్యర్ధుల జాబితాలో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులుగా వేగి వెంకటేష్ (అనకాపల్లి), లావణ్య కావూరి (నెల్లూరు), గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ (నరసరావుపేట), కొప్పుల రాజు (నెల్లూరు), డాక్టర్ చింతా మోహన్ (తిరుపతి) ఉన్నారు. మరికొందరు జాబితాను చివరి లిస్ట్ లో కాంగ్రెస్ ప్రకటిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు