సీబీఐ స్పందిస్తుందా ?
వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఒక లేఖ రాశారు.
వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఒకపుడు హత్యకేసును దర్యాప్తుచేసిన ఎస్సీ రామ్ సింగ్ పై ఫిర్యాదుచేశారు. పక్షపాత ధోరణితోనే ఎస్పీ తనను కేసులో ఇరికించినట్లు ఎంపీ మండిపోయారు. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా తనను ఇరికించి ఇమేజి దెబ్బతీసిన రామ్ సింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్పీ వైఖరిపై శాఖాపరమైన దర్యాప్తుచేసి తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నారు. జరిగిన హత్యలో తనకు ఎలాంటి సంబంధంలేదని ఎస్సీకి తెలిసినా లేదా ఆధారాలు లేకపోయినా తనను కావాలనే ఇరికించినట్లు ఆరోపించారు. రామ్ సింగ్ నుండి దర్యాప్తు బాద్యతలు తీసుకున్న ఉన్నతాధికారుల బృందం కూడా రామ్ సింగ్ దర్యాప్తు ఫైలు ఆధారంగానే తనను విచారించినట్లు చెప్పారు. వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగిందనే కారణంతో అందరికీ తనపైనే అనుమానాలొచ్చేట్లుగా ఎస్పీ కావాలనే ఒక కథను సృష్టించినట్లు ఎంపీ మండిపడ్డారు.
గూగుల్ టేక్ అవుట్ అనే సాంకేతికత ఆధారంగానే హంతకులతో తనకు సంబంధాలున్నట్లు ఎస్పీ సృష్టించిందే అన్నారు. అయితే గూడుల్ టేక్ అవుట్ ఆధారాన్ని నమ్మేందుకు లేదని ఎంతమంది నిపుణులు చెప్పినా రామ్ సింగ్ ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనపెట్టినట్లు చెప్పారు. హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేకపోయినా నిందితుల జాబితాలో తనను చేర్చేట్లుగా రంగం సిద్ధంచేశారన్నారు. డైరెక్టరుకు ఎంపీ 96 పేజీల లేఖను రాశారు. అందులో ఎస్పీ రామ్ సింగ్ పై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు చేశారు.
అంతాబాగానే ఉంది కానీ ఇపుడు రామ్ సింగ్ పై డైరెక్టర్ చర్యలు తీసుకుంటారా అన్నదే ఆసక్తిగా మారింది. ఒక ఎంపీ రాసిన లేఖపై డైరెక్టర్ చర్యలు తీసుకోవటం మొదలుపెడితే రేపు మరో ఎంపీ ఇంకో అధికారిపైన ఫిర్యాదు చేస్తారు. మరపుడు డైరెక్టర్ ఏమిచేస్తారు ? ఇలా చర్యలు తీసుకుంటు పోతే సీబీఐలో ఏ అధికారీ ఉండరు. దర్యాప్తులో అనేక మందిపై అనేక అనుమానాలు వస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అధికారుల్లో ఒక్కోక్కళ్ళది ఒక్కో స్టైలుగా ఉంటుంది. మరి అవినాష్ చేసిన ఫిర్యాదుపై డైరెక్టరు ఏమిచేస్తారో చూడాలి.