గజ్వేల్ లో ఓటర్లు 50 వేలు పెరిగారు.. వారు కేసీఆర్ కు వేస్తారా?

అంతేగాక.. మరో ముఖ్యమైన అంశం ఏమంటే గజ్వేల్ లో మునుపెన్నడూ లేని రీతిలో ఓటర్లు పెరిగారు.

Update: 2023-11-11 10:12 GMT

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక సమరం గజ్వేల్ దే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢీకొట్టడంతో గజ్వేల్ గరంగరంగా మారింది. అంతేకాదు.. సామాజిక సమీకరణం పరంగానూ గజ్వేల్ కాస్త భిన్నం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు సవాల్ ఎదురవుతోంది. అంతేగాక.. మరో ముఖ్యమైన అంశం ఏమంటే గజ్వేల్ లో మునుపెన్నడూ లేని రీతిలో ఓటర్లు పెరిగారు. ఈ అసాధారణ పెరుగుదల సీఎం కేసీఆర్ కు కాస్త ఇబ్బందికరమే అనే వాదన వినిపిస్తోంది.

ఫలితం ఏమగునో?

గజ్వేల్ 2009 ముందువరకు ఎస్సీ రిజర్వుడ్ గా ఉండేది. పునర్ విభజనలో జనరల్ అయింది. 2014కు వచ్చేసరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయడంతో ప్రముఖ నియోజకవర్గంగానూ మారింది. అయితే ,2014తో పోలిస్తే గజ్వేల్ లో 2018 ఎన్నికలకు ఓటర్లు స్వల్పంగా తగ్గారు. 2014లో 2.20 లక్షల మందికి అటుఇటుగా ఉండగా, 2018లో వారు ఇంకాస్త తగ్గారు. అయితే, ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 50 వేల వరకు పెరుగుతున్నారు. ఇది అనూహ్యమే కాక ఫలితంపైన ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొత్త ఓటర్ల మాటేమిటో?

అన్నిటికిమించి గజ్వేల్ లో కొత్త ఓటర్లు కూడా భారీగా పెరిగారని స్పష్టమవుతోంది. వీరి సంఖ్య కూడా పదివేల వరకు ఉండొచ్చని అంచనా. కచ్చితంగా చూస్తే గత ఎన్నికలకు ఇప్పటికి ఓటర్ల సంఖ్యలో 50 వేల వరకు తేడా జంప్ కనిపిస్తోంది. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం గజ్వేల్ మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 లక్షల పైనే ఉండొచ్చని అంచనా. అయితే, ఈ స్థాయిలో భారీగా ఓటర్ల సంఖ్య జంప్ వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 10 వేలకుపైగా ఓట్లు కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులవి. వీరంతా గతంలో దుబ్బాక నియోజకవర్గంలో ఉండేవారు. జలాశయం నిర్మాణంతో గజ్వేల్ నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఓటర్లుగా మారారు. మరొకవైపు గత కొన్నేళ్లలో గజ్వేల్ ప్రాంతంలో వివిధ పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు కాగా, వాటిలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల కూలీలు భారీగా తరలివచ్చారు. వీరంతా కలిపి 5-6 వేలమందిపైనే ఉంటారు.

ఈటల గట్టి పోటీని తట్టుకుని..

2014లో కేసీఆర్ పై టీడీపీ తరఫున ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి పోటీ చేశారు. మరీ ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. నాటి ఎన్నికల్లో కేసీఆర్ 19 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018కి వచ్చేసరికి గజ్వేల్ ను బాగా డెవలప్ చేయడంతో మెజార్టీ 50 వేలను దాటింది. అయితే, ఈసారి ప్రతాప్ రెడ్డిని బీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈటల రాజేందర్ వంటి నాయకుడు కేసీఆర్ ను ఢీకొడుతున్నారు. ఈటల సామాజిక వర్గం ముదిరాజ్ ల ఓట్లు గజ్వేల్ లో 60 వేల పైనే ఉన్నాయి. వీరంతా ఈటలకు గట్టి మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త ఓటర్ల మొగ్గు కూడా ఈటల వైపే ఉందని చెబుతున్నారు. మరి వీరిని తమవైపు తిప్పుకొనేందుకు సీఎం కేసీఆర్ తరఫున మంత్రి హరీశ్ ఎలాంటి ప్రయత్నం చేస్తారో చూడాలి.

కొసమెరుపు: గజ్వేల్ లో 2014లో కేసీఆర్ ను టీడీపీ అభ్యర్థిగా ఢీకొట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నర్సారెడ్డి తర్వాత పార్టీలు మారారు. 2018 నాటికి నర్సారెడ్డి బీఆర్ఎస్ లో ఉండగా, ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పోటీ చేశారు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉండగా, నర్సారెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి పోటీకి దిగారు. ఇప్పుడు నర్సారెడ్డి కాంగ్రెస్ ఓట్లను తనకు పడేలా చూసుకుంటారని.. బీజేపీ తరఫున ఈటల గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఏం జరుతుందో డిసెంబరు 3న చూద్దాం..

Tags:    

Similar News