గూగుల్ కు గుబులు రేపేలా చాట్ జీపీటీ సెర్చ్ జీపీటీ!

భవిష్యత్ టెక్నాలజీలు ఏవంటే.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించి ముందుగా చెప్పాల్సి ఉంటుంది.

Update: 2024-07-26 11:40 GMT

గత రెండేళ్లుగా టెక్ ప్రపంచంలో సంచలనం చాట్ జీపీటీ.. అడిగిన దానికి కాదనకుండా సమాధానాలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తోందీ ఆవిష్కరణ. మరి.. ఇలాంటి టెక్నాలజీని కలిగి ఉన్న సంస్థ.. ఏకంగా సెర్చ్ ఇంజిన్ విభాగంలోకి అడుగుపెడితే..? ఇప్పుడదే జరగబోతోంది.. రానున్న కాలంలో గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా, ఓ లెక్కన చెప్పాలంటే దానిని పడగొట్టేలా ఎత్తులు వేస్తోంది చాట్ జీపీటీ మదర్ కంపెనీ ఓపెన్ ఏఐ.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో..

భవిష్యత్ టెక్నాలజీలు ఏవంటే.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించి ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ఏఐను ఆధారం చేసుకుని సవేలు అందిస్తోంది చాట్‌ జీపీటీ. పేరులో ఉన్నట్లే చాట్ చేస్తే చాలు ఏ విషయాన్నయినా చెప్పేస్తోంది. దీని మదర్ కంపెనీ (మాతృ సంస్థ) ఓపెన్‌ ఏఐ. చాట్ జీపీటీతోనే ఓ విధంగా గూగుల్ కు జెల్ల కొట్టిన ఓపెన్ ఏఐ... ఇప్పుడు మరో కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. అది కూడా గూగుల్‌ కు గూబ గుయ్యిమనేలా..

సెర్చింజన్ రారాజును కిందకు దించుతూ..

గూగుల్ అంటే..సెర్జింజన్ కింగ్.. దీని గుత్తాధిపత్యం అంతా ఇంత కాదు. అయితే, ఇప్పుడు చాట్ జీపీటీ మదర్ కంపెనీ ఓపెన్ ఏఐ.. ‘సెర్చ్‌ జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ ను తెచ్చింది. ఇది ఇంటర్నెట్‌ లోని రియల్‌ టైమ్‌ డేటా ను ఏఐ ఆధారిత సెర్చింజిన్‌ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటో టైప్‌ స్టేజ్‌లో ఉన్న సెర్చ్ జీపీటీని పరిమిత గ్రూప్‌, పబ్లిషర్లతో టెస్టింగ్ చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది. కాగా, సెర్చింజిన్‌ విషయంలో 91 శాతం వాటా గూగుల్‌ దే. ఇప్పుడు తమ సెర్చింజిన్‌ గురించి ఓపెన్ ఏఐ ప్రకటనతో.. గూగుల్‌ మదర్ కంపెనీ అల్ఫా బెట్‌ షేర్లు 3 శాతం పడిపోయాయి. దీన్నిబట్టే ఓపెన్ ఏఐ సెర్చింజన్ సెర్చ్ జీపీటీ సత్తా ఏమిటో తెలుస్తోంది. కాగా, ఓపెన్ ఏఐ సెర్చింజన్ సెర్చ్ జీపీటీ.. గూగుల్‌, బింగ్‌ వంటి సాధారణ సెర్చింజిన్లలా కాకుండా.. కొంత సమాచారంతో పాటు సంబంధిత లింక్‌ లను కూడా జోడించడం విశేషం. అంటే.. మ్యూజిక్‌ ఫెస్ట్‌ ల సమాచారం అడిగితే ఆ వివరాలే కాక సంబంధిత కంటెంట్‌ ను ఎక్కడినుంచి అందిస్తున్నదీ వివరిస్తుంది. యూజర్లు ఏమైనా అనుబంధ ప్రశ్నలు అడిగితే వాటికీ సమాధానాలు ఇస్తుంది. కాగా,సెర్చ్‌ జీపీటీ పనితీరు అంచనాకు కంపెనీ తొలుత పబ్లిషర్లకు దీన్ని అందించనుంది.

దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ కు చెందిన బింగ్‌.. ఇప్పుడు ఓపెన్‌ ఏఐ టెక్నాలజీ వాడుతోంది. గూగుల్‌ సైతం సెర్చ్‌ రిజల్ట్స్‌ లో ఏఐ సాయంతో సమ్మరీని అందిస్తోంది. అయితే, సెర్చింజిన్‌ విభాగంలోకి ఓపెన్‌ ఏఐ రాకతో ఎప్పటికైనా గూగుల్‌, బింగ్‌ కు పోటీ కావడం తథ్యం. అందుకే అల్ఫాబెట్ షేర్లు పడిపోయాయని అంటున్నారు.

Tags:    

Similar News