అధ్యక్షా.. ఎప్పుడు కదులుతారు... టీ బీజేపీలో ఇదేం విచిత్రం రా బాబు...!
కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఊపు ఎక్కడా కనిపించడం లేదు. ఇదీ.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి పరిస్థితి అంటున్నారు ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు.
ఒకవైపు ప్రధాన పార్టీలు చుట్టేస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా రాష్ట్రంలోని జిల్లాలను సుడిగాలి మాదిరిగా తిరిగేస్తు న్నాయి. కానీ, మరో కీలకపార్టీ మాత్రం ఆ ఊసెత్తడమే లేదు. ఎక్కడా కదలిక కూడా రావడం లేదు. పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శి స్తున్నారు. అధికారంలోకి వచ్చేస్తామని.. అధికారం తమదేనని కూడా చెప్పేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఊపు ఎక్కడా కనిపించడం లేదు. ఇదీ.. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి పరిస్థితి అంటున్నారు ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు.
అధికార బీఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల చీఫ్‌లు.. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అయితే.. రోజుకు రెండు నుంచి నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా.. అదే తీరుగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులను కదిలిస్తున్నారు. ఫైర్‌బ్రాండ్ మాదిరిగా మాటల టపాకులు పేలుస్తున్నారు. దీంతో ఎటు విన్నా.. ఈ రెండు పార్టీల ఊసే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల గురించిన చర్చే కనిపిస్తోంది. కానీ, తెలంగాణ అభివృద్ది తమతోనే సాధ్యమైందని చెబుతున్న బీజేపీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి మాత్రం ఎక్కడా హైదరాబాద్ నగరం దాటి రావడం లేదు.
మరోవైపు.. ఢిల్లీలో ఏదైనా కార్యక్రమం ఉంటే.. అక్కడకు వెళ్లిపోతున్నారు. ఆ కార్యక్రమం ముగియగానే మళ్లీ హైదరాబాద్‌కు వస్తున్నారు. వెంటనే మీడియా మీటింగు పెట్టి.. కొంచెం సేపు బీఆర్ ఎస్‌ను.. తర్వాత.. కొద్ది సేపు కాంగ్రెస్‌ను తిట్టిపోస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని చెబుతున్నారు. కుటుంబ పార్టీలంటూ.. కౌంటర్లు ఇస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన జిల్లాల పర్యటనను పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. మరో 8 రోజుల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. మొత్తం 33 జిల్లాల్లో పర్యటనలు చేయాల్సి ఉంది. కానీ, ఆ షెడ్యూల్ కానీ.. ఆ ధ్యాస కానీ.. కిషన్ రెడ్డిలో ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
అయితే.. మాజీ చీఫ్ బండి సంజయ్ మాత్రం తాను పోటీలో ఉన్న నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తున్నారు. లేదా మిత్రులు ఎవరైనా అడిగితే అక్కడకు వెళ్తున్నారు తప్ప.. రాష్ట్ర స్థాయిలో పైర్ బ్రాండ్ కానీ, ఫేమస్ పొలిటీషియన్ కానీ.. బీజేపీకి నిరంతరాయంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాని మోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వచ్చినప్పుడు మాత్రం కొంత హడావుడి ఉందే తప్ప.. బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున ప్రచార ఐకాన్లు అంటూ.. పెద్దగా ఎవరూ కనిపించడం లేదన్నది ఆ పార్టీలోనే వినిపిస్తున్న మాట. దీంతో అధ్యక్షా.. ఎప్పుడు కదులుతారు? అనే టాక్ వినిపిస్తోంది.