పిఠాపురంలో కొత్త రికార్డు ఎవరిది...!?
పవన్ కళ్యాణ్ పోయిన సారి ఎన్నికల్లో గాజువాక భీమవరంలలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఏపీలో ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఎన్నిక మరో ఎత్తుగా ఉంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఆ సీటుకు వెయిట్ ని పెంచింది. హీటెక్కిస్తోంది. పవన్ కళ్యాణ్ పోయిన సారి ఎన్నికల్లో గాజువాక భీమవరంలలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
ఆనాడు అన్నీ ఆలోచించి పవన్ భీమవరం గాజువాకలను ఎంచుకున్నారు. ఈ రెండు చోట్ల కాపులు అత్యధికంగా ఉన్నారు. అయినా ఓటమి పాలు అయ్యారు. ఈసారి కూడా అన్నీ ఆలోచించి మరీ పవన్ పిఠాపురం వస్తున్నారు. పిఠాపురంలో ఉన్నది రెండు లక్షల ముప్పయి వేల పై చిలుకు ఓట్లు అంటే ఇందులో ఏకంగా 91 వేల ఓట్లు కాపులవే. అంటే నలభై శాతానికి పైగా ఒకే సామాజిక వర్గానివి ఉన్నాయన్నమాట.
మొదటి నుంచి పిఠాపురంలో కాపులే గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు వేరు అయినా సామాజిక వర్గం మాత్రం అదే కావడం విశేషం. ఇక 1952 నుంచి అనేక ఎన్నికలను పిఠాపురం చూస్తూ వచ్చింది. అయితే అన్ని ఎన్నికలూ ఆసక్తి కరమే. అంతే కాదు హోరా హోరీ పోరుతో సాగినవే.
ఇక మెజారిటీలు చూస్తే ఎపుడూ ఇరవై వేలను పై దాటినవి లేవు. కానీ 2014లో మాత్రం ఏకంగా 47 వేల 80 ఓట్లు వచ్చాయి. అదే అత్యధిక మెజారిటీగా ఉంది. ఈ మెజారిటీని గతంలో ఎవరూ సాధించలేదు. పిఠాపురంలో ఇప్పటికి పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఎవరికీ ఇందులో సగం మెజారిటీ కూడా దక్కలేదు.
పైగా ఘనమైన పార్టీలు ప్రముఖులు కూడా ఈ సీటు నుంచి పోటీ చేశారు. కాపుల సీటుగా పేరొందిన పిఠాపురం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎస్వీఎస్ ఎన్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఆనాడు పోటీలో ఉన్న ప్రముఖ పార్టీలు టీడీపీ వైసీపీలను పక్కన పెట్టి మరీ బంపర్ మెజారిటీతో గెలవడం అంటే నిజంగానే రాజకీయ చిత్రం అద్భుతం అని చెప్పాలి.
ఇపుడు చూస్తే లక్ష మెజారిటీ పవన్ కి రావడం ఖాయం అని జనసేన సైనికులు అంటున్నారు. పవన్ సైతం లక్షకు మెజారిటీ తగ్గకూడదు అని అంటున్నారు. మరి అదే నిజం అవుతుందా లేక మెజారిటీలు మారుతాయా లేక వైసీపీ ప్లాన్ బీ ఫలించి ఆ పార్టీ నెగ్గుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె 2009లో వేయి ఓట్ల తేడాతోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఇది స్వల్ప మెజారిటీ అనుకుంటే ఈసారి తాను బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతాను అని అమె అంటున్నారు. పిఠాపురం మొత్తం వైసీపీ మోహరిస్తోంది. భారీ ఎత్తున వ్యూహ రచన చేస్తోంది. పవన్ ని ఓడించాలన్న పంతంతో పనిచేస్తోంది.
బీసీలను ఎస్సీలను ఇతర సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకుంటోంది. మరి వైసీపీ వర్సెస్ జనసేన పోరులో ఎవరు నెగ్గుతారు. ఎవరు అత్యధిక మెజారిటీ సాధిస్తారు అన్నది ఉత్కంఠను రేపుతోంది. అదే టైంలో 2014 నాటి వర్మ రికార్డు మెజారిటీని బద్ధలు కొట్టి సరికొత్త రికార్డుని ఎవరు క్రియేట్ చేస్తారు అన్నది కూడా ఆసక్తిగా ఉంది.