నిన్న సచివాలయాలకు, రేపు బ్యాంకులకు... పెన్షన్ కష్టాలకు కారకులెవరు?

అయితే... వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సున్నితమైన విషయంపై దృష్టి సారించారు.

Update: 2024-04-30 01:30 GMT

గత 58 నెలలుగా ఎన్నడూ లేని చర్చ ఒకటి గత నెలన్నర రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. పైగా.. అది అత్యంత కీలకమైన విషయం, అదే స్థాయిలో ఇది కీలకమైన ఎన్నికల సమయం కావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశ అంశం! అదే... ఏపీలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతీ నెలా ఒకటో తేదీన వచ్చే పెన్షన్!

ఒకసారి గతంలోకి వెళ్తే... అప్పట్లో పెన్షన్ బ్యాంక్ అకౌంట్లలో పడేది! దీంతో.. ప్రతీనెల మొదటి వారంలో వృద్ధులంతా బ్యాంకుల వద్దకు క్యూ కట్టేవారు! ఇప్పుడున్నన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు కూడా నాడు లేవనే చెప్పుకోవాలి! అయితే... వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సున్నితమైన విషయంపై దృష్టి సారించారు. వృద్ధులను, వికలాంగులనూ దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా సరాసరిన రోజుకి కనీసం 100 రూపాయల చొప్పున ఇప్పుడు పెన్షన్ ఇస్తూ... ప్రతీ నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే పెన్షన్ పంపించేవారు. ఈ నిర్ణయంపై అభినందనలు బాగానే వచ్చాయి కూడా! ఆ సమయంలో వేలిముద్ర వేసిన వెంటనే గుమ్మంలోనే డబ్బులు చేతిలోకి వస్తుండటంతో పెన్షన్ దారుల కళ్లల్లో ఆనందం కనిపించేది. గతంలో ఎంతోమంది పెద్దలు రాష్ట్రాన్ని పాలించినా.. ఈ తరహా ఆలోచన ఎవరూ చేయలేదనే చర్చా నడిచేది!

కట్ చేస్తే... ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో... పెన్షన్లతో పాటు సంక్షేమ పథకాలను అర్హులకు ఇళ్ల వద్ద అందించే వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు “ప్రజా”స్వామ్య సంరక్షకులమని చెప్పుకునే కొంతమంది ఫిర్యాదులు చేశారు!! దీంతో... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ పెన్షన్, రేషన్ వంటి సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకెళ్లి అందించే ప్రక్రియకు అతిపెద్ద బ్రేక్ పడినట్లయ్యిందనే చర్చ తెరపైకి వచ్చింది.

సుమారు 58 నెలలుగా అలవాటు పడిన ప్రాణాలు, సుమారు 58 నెలలుగా సాగుతున్న ఒక ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది! అది అంతలా నిలిపివేయాల్సిన ప్రక్రియా...? ఆ ప్రశ్న సంగతి కాసేపు పక్కనపెడితే... ఏప్రిల్ ఒకటో తేది పెన్షన్ సమయం వచ్చింది. దీంతో... వృద్ధులు, వికలాంగులు అనే తారతమ్యాలేమీ లేకుండా... అంతా సచివాలయాల బాట పట్టారు! చేతి కర్రలు, మూడు చక్రాల కుర్చీలూ సచివాలయాలవైపు కదిలాయి!

ఈ ప్రహసనంలో సుమారు 32 మంది మృతి చెందారు! దీంతో... ఈ పాపం ఎవరిది..? నేడు పెన్షన్ దారులంతా ఇన్ని ఇబ్బందులకు కారకులెవ్వరు..? అనే చర్చ బలంగా నడించింది. ఈ క్రమంలోనే.. తిట్లు, చివాట్లు, శాపనార్ధాలు తెరపైకి వచ్చాయి! కట్ చేస్తే... మళ్లీ ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఒక్క రోజు గడిస్తే పెన్షన్ తేదీ వచ్చేసినట్లే! ఈ సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వాలంటీర్లతో ఇంటింటికీ పంపించే పరిస్థితి ఎలాగూ లేదు.. పైగా ఎండనపడి సచివాలయాలకూ వెళ్లాల్సిన అవసరం లేదు.. కాస్త చల్లబడిన తర్వాతో, ఎండ తగ్గిన తర్వాతో బ్యాంకులకు వెళ్లి అమౌంట్ విత్ డ్రా చేసి తెచ్చుకునేలా.. బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ డబ్బులు వేస్తామని తెలిపారు అధికారులు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అలానే వేసేవారని పలువురు కామెంట్ చేశారు!

ఈ సమయంలో చంద్రబాబు స్పందించారు. బ్యాంకుల్లో కూడా వేయవద్దు.. ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటింటికీ పంపించండి అని అన్నారు. అందుకు చంద్రబాబు చెప్పిన కారణం... బ్యాంకు అకౌంట్లో పెన్షన్ వేస్తే వృద్ధుల‌కు ఎండ‌లో వెళ్లి తెచ్చుకోవడం క‌ష్టం.. ఎవ‌ర్నన్నా తోడు తీసుకెళ్లి తెచ్చుకోవాలంటే 3, 4 వంద‌లు వెళ్లి రావ‌డానికే అయిపోతాయ‌ని అంట! ఇదే నిజమైతే... టీడీపీ హ‌యాంలో పెన్షన‌ర్లు చాలా అవ‌స్థలు పడ్డారనే విషయాన్ని బాబు ఒప్పుకున్నట్లే కదా అనేది మరో లాజిక్!

అయితే.. చంద్రబాబు ఆందోళన వెనుక బలమైన రాజకీయ కారణం ఉందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఏప్రిల్ నెలలో పెన్షన్ కోసం ఇబ్బందిపడటంతో వారంతా చంద్రబాబునే ప్రధాన ముద్దాయిగా చూశారనేది బలంగా వినిపిస్తున్న మాట. ఇదే సమయంలో.. మే నెలలో సచివాలయాల చుట్టూ తిరిగినా, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చినా.. ఆ పాపం కూడా బాబు ఖాతాలోనే పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు!

ఇదే సమయంలో... “చంద్రబాబు అధికారంలోకి వస్తే పెన్షన్ కోసం ఇవే పాట్లు పడాల్సి వస్తుంది” అనే చర్చ పెన్షన్ తీసుకునేవారి మధ్య మొదలవుతుంది! ఈ తరహా చర్చను వైసీపీయే లేవనెత్తినా ఆశ్చర్య లేదు.. తప్పుకూడా కాదు! ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబును తీవ్ర అందోళనలో పాడేస్తుందని అంటున్నారు!! సరే, ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతున్నా... మే నెలలో మాత్రం మరోసారి పెన్షన్ దారులకు కష్టాలు తప్పవనేది వాస్తవం అనే అనుకోవాలి!

ఈ సమయంలో... ఎవరైనా “ప్రజా”స్వామ్య సంరక్షకులం అని చెప్పుకునేవారు.. అవి పెద్ద కష్టాలు కాదని వాదించినా... గతంలో ఉన్నంత కంఫర్ట్ బుల్ గా అయితే మాత్రం పెన్షన్ అందదు అనే చెప్పుకోవాలి!! మరి సుమారు 70 లక్షల మంది వరకూ ఉన్న పెన్షన్ దారులు... వారు పడుతున్న కష్టాలకు ఎవరు కారణం అని భావిస్తారు..? వారిపై ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? అనేది వేచి చూడాలి!!

ఈ సమయంలోనే... నిన్నటి వరకూ ఇంటివద్దకే పెన్షన్ వస్తే... “హమ్మయ్య ఒకటో తారీఖు” అనుకునే వృద్ధులంతా ఇప్పుడు “అమ్మో ఒకటో తారీఖు” అనుకునే పరిస్థితి అని చెప్పినా అతిశయోక్తి కాదని అంటున్నారు!

Tags:    

Similar News