పెద్దల సభ లోనే...పెద్ద మనిషి గానే !

ఇక మన్మోహన్ సింగ్ గొప్పతనం ఏంటి అంటే ఆయనకు 1987లోనే పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి.

Update: 2024-12-27 04:31 GMT

గురువారం దివంగతులైన దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితాన్ని తరచి చూసినపుడు చిత్రమైన విషయాలు తెలుస్తాయి. ఆయన 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. అది లగాయితూ ఆయన రాజ్యసభ నుందే సభ్యుడిగా ఉంటూ దేశానికి సేవ అందించారు.

ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నా ప్రధానిగా రెండు పర్యాయాలు పదేళ్ల పాటు పనిచేసినా రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు. లోక్ సభ నుంచి సాధారణంగా పధాని అవుతారు. కానీ దానిని భిన్నంగా రాజ్యసభ నుంచి గెలిచి ప్రధానిగా సేవలు అందించిన వారుగా మన్మోహన్ నిలిచారు. ఆయన అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అలా మొత్తం 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న మన్మోహన్ సింగ్ పెద్దల సభలోనే మొత్తం గడిపారు. పెద్ద మనిషిగా రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు.

ఆయన గురువు పీవీ నరసింహారావు మితభాషి. ఆయన కంటే మితభాషిగా శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరుని చెబుతారు ఈ గురు శిష్యుల మధ్య సంభాషణ ఎలా జరిగి ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే ఇద్దరూ మాటలకు తూనిక వేసి మాట్లాడుతారు అని అంతా చమత్కరించేవారు.

ఇక మన్మోహన్ సింగ్ గురించి మరో విషయం చెప్పాలి. ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలా కాలం పాటు పనిచేశారు. ఆనాడు కూడా ఆయన ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకమైన పంధాలోనే విమర్శలు చేసేవారు.

ఇక ఆయన యూపీఏకు రెండవసారి ప్రధానిగా ఉండగా ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఆ సమయంలో విభజన ఏపీకి ఇచ్చే వరాలలో భాగంగా ప్రత్యేక హోదాను రాజ్యసభలో ప్రకటించారు. అలా ఏపీకి ఆయన చేసిన సాయంగా అంతా మెచ్చుకున్నారు. కానీ దానిని అమలు చేయడానికి తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆసక్తి చూపలేదన్న విమర్శలు ఉన్నాయి.

ఆనాడు మన్మోహన్ రాజ్యసభలో మౌఖికంగా ఈ విషయం ప్రకటించారని అందువల్ల దానిని అమలు చేయలేమని కూడా పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక మన్మోహన్ సింగ్ గొప్పతనం ఏంటి అంటే ఆయనకు 1987లోనే పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. ఆక్స్ ఫర్డ్ మొదలులుని ప్రపంచంలో ప్రఖ్యాతమైన విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు ఎన్నో వచ్చాయి. ఆయనకు వచ్చిన అవార్డులు పురస్కారాలు ఆయనలోని ఆర్ధిక వేత్తను చాటి చెబుతాయి.

ఇక పదవిని ఆయన ఎపుడూ కోరుకోలేదు. అనూహ్యంగా ప్రధాని అయ్యారు. అయితే ఆయన రెండవ టెర్మ్ కూడా ప్రధానిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దలకు సూచించారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇక రాహుల్ ని తన కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేయమని కోరారు అని కూడా చెబుతారు.

అందుకే మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న రాహుల్ గాంధీ బాధాతప్త హృదయంతో తన రాజకీయ మార్గదర్శి లేకుండా పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రధాని మోడీ అయితే దేశం మొత్తం దుఖిస్తోంది అని విషాదంతో నిండిన ట్వీట్ చేశారు.

తాను గుజరాత్ సీఎం గా ఉన్నపుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ తనతో తరచూ మాట్లాడేవారు అని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ మరణం అన్నది ఈ దేశానికి విషాదం. ఆయన గొప్ప ప్రధానిగా ఉన్నారు. అంతే కాదు ఈ దేశానికి నెహ్రూ, ఇందిరా గాంధీ నరేంద్ర మోడీ తరువాత అత్యధిక కాలం ప్రధానిగా సేవలూ అందించిన నేతగా కూడా చరిత్ర పుటలలోకి ఎక్కారు. అందుకే ఆయనకు దేశమంతా ఘన నివాళిని అర్పిస్తోంది. ఆయన జ్ఞాపకాలను తలచుకుంటోంది.

Tags:    

Similar News