అమరావతి రాజధాని భవిష్యత్తు దర్శనాన్ని చేయించిన బాబు!

అమరావతి పనులను ఆయన తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా సుదీర్ఘంగా చేసిన ప్రసంగం గమనిస్తే చాలా విషయాలు అర్ధం అవుతాయి.

Update: 2024-10-19 15:46 GMT

ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గట్టిగా స్పష్టం చేశారు. అమరావతి పనులను ఆయన తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంగా సుదీర్ఘంగా చేసిన ప్రసంగం గమనిస్తే చాలా విషయాలు అర్ధం అవుతాయి. అమరావతి అన్నది దేవతల నగరం అన్నారు బాబు.

అమరావతిని స్వర్గంగా తీర్చిదిద్దుతామని కూడా ప్రకటించారు. అమరావతి పేరు సజెస్ట్ చేసింది పత్రికాధిపతి దివంగతులైన రామోజీరావు అని కూడా సభా ముఖంగా చెప్పారు. పురాణాల్లో అమరావతి ప్రశస్తి ఎంతగానో ఉందని బాబు అన్నారు. తాను కూడా అన్నీ అధ్యయనం చేసి అమరావతి పేరుని పెట్టాలని నిర్ణయించాను అన్నారు.

ఇక అమరావతి పేరుకు ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజలు కూడా నూటికి నూరు మార్కులు వేసారు అని బాబు అన్నారు. అమరావతి ఏపీకి రేపటి రోజున గ్రోత్ ఇంజన్ అవుతుందని అన్నారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని గత వైసీపీ పాలకులు అన్నారని ఆయన విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు. సంపద సృష్టికి బుర్ర వాడాలని అన్నారు. ఒక్క ఆలోచన సంపదను సృష్టించి పెడుతుందని బాబు అన్నారు.

అమరావతిని దేశం మొత్తం ఆదరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్ళినపుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలసి అమరావతికి బుల్లెట్ ట్రైన్స్ వేయమని కోరాను అన్నారు. దక్షిణాదిన బుల్లెట్ ట్రైన్స్ వేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోందని అయితే అమరావతిని కలుపుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లతో లింక్ చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ వేయాలని కోరాను అని చెప్పారు. దాని మీద సానుకూల స్పందన లభిస్తోంది అని ఆయన అన్నారు.

మరో వైపు చూస్తే అమరావతికి కేంద్ర ప్రాజెక్టులు 131 దాకా వస్తున్నాయి వాటికి పెద్ద ఎత్తున భూములను కేటాయించామని అన్నారు. అలాగే అనేక ప్రైవేట్ ప్రాజెక్టులు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా అమరావతి రాజధానిని మూడేళ్ళలో పూర్తి చేస్తామని ఆయన ఒక నిర్దిష్ట కాలపరిమితిని పెట్టారు.

అమరావతి పూర్తి అవుతూనే అతి పెద్ద రాజధాని నగరంగా మారుతుందని అన్నారు. గుంటూరు, క్రిష్ణా జిల్లాలను కలుపుతూ అమరావతి విస్తరిస్తుందని బాబు జోస్యం చెప్పారు. ఏకంగా కోటి మంది జనాభా ఫ్యూచర్ లో అమరావతిలో నివాసం ఉంటారని కూడా బాబు చెప్పుకొచ్చారు.

దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు అమరావతి వచ్చేలా నిర్మాణాలు కట్టడాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. మొత్తం మీద అమరావతి రాజధాని భవిష్యత్తు దర్శనాన్ని చంద్రబాబు చేయించారు. అమరావతి సౌత్ లోనే కాదు, దేశంలోనే అతి పెద్ద మహా నగరం అవుతుందని కూడా ఆయన జోస్యం చెప్పడం మీద చర్చ సాగుతోంది.

అమరావతి చంద్రబాబు కలల ప్రాజెక్ట్. అమరావతిని ఏపీలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ చేయాలని బాబు ఆశిస్తున్నారు. దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ మొదలైంది అని అంటున్నారు. నిజంగా ఏపీ రాజధాని ఆ స్థాయిలో నిర్మాణం జరుపుకుని కొన్నేళ్ళకైనా నంబర్ వన్ అయితే గ్రేట్ గానే భావించాలి. మరి ఆ దిశగా అడుగులు ఎంత బలంగా పడతాయన్నదే చూడాల్సిన విషయం.

Tags:    

Similar News