ఇప్పటికి రెండు నెలు.. మరి హసీనా.. కబ్ జాయేగీ?
అత్యంత సంక్షోభ కాలంలో శరణు కోరి వచ్చిన ఆడ బిడ్డలకు భారత దేశం ఆశ్రయం ఇచ్చింది.
అతిథి దేవోభవ.. భారత కల్చర్ లో అణువణువు నిండిన పద్ధతి ఇది.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇంటికి వచ్చినవారిని దేవుడిగా చూసే పద్ధతి మిగతా దేశాల్లో ఉందో లేదో కానీ.. మన దేశం మాత్రం అక్కున చేర్చుకుంటుంది. దీనికి పలుసార్లు మూల్యం కూడా చెల్లించుకుంది. తాజాగా చూస్తే ఆగస్టు 5న తమ దేశంలో అలజడి రేగడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి హుటాహుటిన బయల్దేరి భారత్ కు చేరుకున్నారు షేక్ హసీనా. తనతో పాటు ఆమె చెల్లెలు రెహానా కూడా ఉన్నారు. అత్యంత సంక్షోభ కాలంలో శరణు కోరి వచ్చిన ఆడ బిడ్డలకు భారత దేశం ఆశ్రయం ఇచ్చింది.
అప్పట్లో దలైలామా..
1950ల్లో టిబెట్ పై చైనా దమనకాండతో భారత్ కు వచ్చారు బౌద్ధ మత గురువు దలైలామా. ఆయన శిష్య గణంతో పాటు భారత్ కు చేరుకోగా అతిథిగా గౌరవించి ఆతిథ్యం ఇచ్చింది మన దేశం. కానీ, ఇది చైనాకు కన్నెర్ర అయింది. దలైలామాను అప్పగించనందుకు భారత్ పై ఆక్రమణకు దిగింది. చివరకు కొంత భూభాగాన్ని చైనాకు కోల్పోయింది. ఇక దలైలామా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను తన కార్యక్షేత్రంగా మార్చుకుని ఇక్కడే జీవిస్తున్నారు. ఆయన ఇక్కడినుంచే వివిధ దేశాల పర్యటనలకు వెళ్తుంటారు. చైనా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా దలైలామాను భారత్ వెళ్లిపోమని చెప్పలేదు. అతిథి వారంతట వారే వెళ్లాలనేది తమ సంప్రదాయంగా చెబుతోంది.
హసీనా ఎన్నాళ్లో?
లెక్కపెట్టి చెప్పడం సరికాదు కానీ.. భారత్ లో రెండు నెలులగా ఉంటున్నారు షేక్ హసీనా. ఆగస్టు 5న ఘజియాబాద్ చేరుకున్న హసీనాను భారత ప్రభుత్వం ఆదరించింది. తొలుత బ్రిటన్ వెళ్లాలనుకున్న హసీనాకు ఆ దేశం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో భారత్ ను శరణు కోరారు. సరిహద్దుల నుంచి యుద్ధ విమానాలు పంపి మరీ హసీనా సురక్షితంగా భారత్ చేరేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా, హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. దీనిని భారత్ ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయింది కూడా.
వెళ్లడం కష్టమే..
ఇక హసీనా తిరిగి స్వదేశం వెళ్లడం కష్టమే అని స్పష్టమవుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై వందల కేసులు బనాయించింది. ఇప్పుడు 75 ఏళ్ల హసీనా బంగ్లాకు వెళ్తే వెంటనే అరెస్టు చేసి జైల్లో వేస్తుంది. అందుకనే ఆమె భారత్ లోనే సాధ్యమైనన్ని రోజులు ఉంటారని భావించాల్సి వస్తోంది.