బీజేపీ అధ్యక్ష పదవి 'మామ'కు కట్టబెట్టనున్నారా?
రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్ కు పదహారేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన్ను తాజాగా బీజేపీ జాతీయఅధ్యక్ష పదవిని కట్టబెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నడ్డాను మార్చేందుకు బీజేపీ అధినాయకత్వం నిర్ణయించిందా? ఆయన స్థానంలో కొత్తగా ఎంపికయ్యే నేత ఎవరు? అన్నదిప్పుడు చర్చగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత.. పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు జాతీయ అధ్యక్ష పదవి దక్కనున్నట్లుగా చెబుతున్నారు. 65 ఏళ్ల వయసులో ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసిందన్న చర్చ జరుగుతున్న వేళలో.. ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
శివరాజ్ సింగ్ ను బీజేపీ అభిమానులు ముద్దుగా ‘మామ’ అని పిలుస్తుంటారు. రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్ కు పదహారేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన్ను తాజాగా బీజేపీ జాతీయఅధ్యక్ష పదవిని కట్టబెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో పార్టీ అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ ను మార్చి.. ఆయన స్థానంలో మోహన్ యాదవ్ ను ఎంపిక చేసింది. శివరాజ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతను కట్టబెట్టటం ద్వారా బీజేపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై శివరాజ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు వీరతిలకం మనం కోరుకుంటే.. వనమానం దక్కుతుందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ.. శివరాజ్ ను తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు చెప్పటం తెలిసిందే. అనూహ్యంగా ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ. అంచనాలకు మించి భారీ మెజార్టీతో ఎంపీగా (8.2 లక్షల మెజార్టీ) గెలుపొందారు శివరాజ్ సింగ్ చౌహాన్.
తాజాగా నడ్డా స్థానంలో ఆయనకు బీజేపీ పగ్గాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుందని చెబుతున్నారు. మోడీ కంటే ముందే ఎంపీగా ఎన్నికైన శివరాజ్ ప్రొఫైల్ చూస్తే ఆయన రాజకీయ అనుభవం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. ఆరుసార్లు ఎంపీగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శివరాజ్ తో పోలిస్తే పార్టీలో ఆయనకు మించి అనుభవం ఉన్న నేత కనిపించారు. దీనికి తోడు బీజేవైం జాతీయ అధ్యక్షుడిగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. జాతీయ ఉపాధ్యుడిగా.. కేంద్ర ఎన్నికల కమిటీ.. పార్లమెంటరీబోర్డు సభ్యుడిగా పని చేసిన ఆయనకు జాతీయ అధ్యక్ష పదవి పక్కాగా సూట్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఆయనకు ఆ పదవిని కట్టబెట్టేందుకు వీలుగా ఉన్నపళంగా ఢిల్లీకి రావాలని ఆదేశించారు.