బుల్ స్వారీకి మహా ఉత్సాహాన్ని చూపుతున్న ఆమె!

స్టాక్ మార్కెట్ కు దూరంగా ఉంటారని చెప్పే మహిళలు.. మారిన కాలానికి తగ్గట్లు వారిలో మార్పు రావటమే కాదు.. బుల్ స్వారీకి ఆసక్తిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు.

Update: 2025-01-06 05:30 GMT

స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో కూడిన ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్టు విడుదలైంది. స్టాక్ మార్కెట్ కు దూరంగా ఉంటారని చెప్పే మహిళలు.. మారిన కాలానికి తగ్గట్లు వారిలో మార్పు రావటమే కాదు.. బుల్ స్వారీకి ఆసక్తిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేందుకు మహిళల ఆసక్తి అంతకంతకూ పెరుగుతుున్న వైనం తాజా రిపోర్టు స్పష్టం చేసింది. కరోనా తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వైనాన్ని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నారు. 2022 తర్వాత నుంచి ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్టు చెబుతోంది.

2021 నుంచి సగటున మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2014లో దేశం మొత్తమ్మీదా 2.2 కోట్ల ఖాతాలు ఉంటే.. ఇప్పుడు ఖాతాల సంఖ్య 17 కోట్లకు దాటేసింది. కొవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులను సేకరిస్తే.. 2024లో ఏకంగా రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించినట్లుగా రిపోర్టు వెల్లడించింది.

అంతేకాదు సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఏటా రూ.2లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారు. మహిళా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఢిల్లీ (29.8శాతం).. మహారాష్ట్రలో (27.7 శాతం).. తమిళనాడులో (27.5 శాతం)లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలను తీసుకుంటే.. 32 శాతంతో గోవా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. 2022లో ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఇన్వెస్టర్లలో మహిళల సంఖ్య 19.5 శాతం ఉండగా.. అదిప్పుడు 22.7 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

కొవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులుపెట్టే వారిలో 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 30 ఏళ్ల లోపు వారు 22.9 శాతంగా ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 40 శాతానికి చేరుకుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారిలో అత్యధికగా హైదరాబాద్.. బెంగళూరు.. కాన్పూర్ లాంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

Tags:    

Similar News