ఉద్యోగులతో జగన్ ఫుల్ కనెక్టివిటీ......!

ఫస్ట్ టైం ఏపీలో అతి పెద్ద ఉద్యోగ కుటుంబం అయిన ఎన్జీవోలతో గడపబోతున్నారు

Update: 2023-07-31 04:31 GMT

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో మొదటి ఏడాది లో సన్నగా మొదలైన సెగ కాస్తా నాలుగవ ఏడాది కూడా కొనసాగింది. అయితే అది ఇపుడే సెట్ అవుతోంది. ఈ మధ్యనే ఉద్యోగులతో సత్సంబంధాలకు వైసీపీ బాటలు వేసుకుంటోంది. 2024 ఎన్నికల ఏడాది కావడంతో వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులతో సరికొత్త బంధానికి తెర తీస్తోంది.

ఇదే అద్దనుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం నుంచి వరాలు అందుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఆగస్ట్ నెల 21, 22 తేదీలలో ఏపీ ఎన్జీవో కౌన్సిల్ సమావేశాలు అమరావతి వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి జగన్ హాజరు కాబోతున్నారు.

ఈ విధంగా ఫస్ట్ టైం ఏపీలో అతి పెద్ద ఉద్యోగ కుటుంబం అయిన ఎన్జీవోలతో గడపబోతున్నారు. జగన్ని ఈ సమావేశానికి ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆహ్వానించారు. దానికి సీఎం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ వివరాలను ఆయన మీడియాకు చెబుతూ తమ సమావేశాలకు ముఖ్యమంత్రులు మంత్రులు హాజరు కావడం గత సంప్రదాయం అని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ రావడానికి అంగీకరించారు అని వెల్లడించారు. తమ డిమాండ్లను కూడా ఆయన మీడియా ముందు పెట్టారు. పెన్షనర్లకు ప్రతీ నెలా ఒకటవ తారీఖునే పెన్షన్ ఇవ్వాలని, అలాగే, తమకు కొత్త పెన్షన్ స్థానంలో పాత పెన్షన్ కొనసాగించాలని, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరారు.

ఇక ఏపీ ఎన్జీవోల సభకు సీఎం జగన్ వస్తున్నారు అంటే ఉద్యోగులలో ఆసక్తి ఉంటుంది. ఆశలు కూడా ఉంటాయి. వారి కోరికల చిట్టా చాలానే ఉంటుంది. మరి జగన్ వరాలు ఇస్తారా ఇస్తే ఎన్ని ఇస్తారు ఏ విధంగా ఏపీ ఎన్జీవోలను మంచి చేసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఏపీ ఎన్జీవోలు అతి పెద్ద సెక్షన్. పైగా తొందరలో ఎన్నికలు ఉన్నాయి. ఇక అక్కడ ముఖ్యమంత్రి హోదాలో అటెండ్ అయిన తరువాత వారి కోరికలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర పెద్దగా ఉంటుంది. అయితే ఇపుడు జగన్ చేతికి ఎముక లేదనే అంటున్నారు. అన్నీ సర్దుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న జగన్ ఏపీ ఎన్జీవోల విషయంలో వారిని ఫుల్ సాటిస్ ఫై చేసిన తరువాతనే ముందుకు సాగుతారని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను ఎవరు తమ వైపు తిప్పుకుంటారో వారిదే విజయం అన్న మాట కూడా చాలా కాలంగా ఉంది. అది నిజం అవుతూ వస్తోంది. 2014లో ఉద్యోగులు అంతా చంద్రబాబుకు జై కొట్టారు, 2019లో జగన్ వైపునకు వారు వచ్చారు. 2024లో వారు ఎవరి వైపు అన్న చర్చ అంతా ఇపుడు సాగుతోంది.

అయితే తన తండ్రి వైఎస్సార్ కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు పొందుతూ వస్తున్న జగన్ వారికి వారి మద్దతుని చేజార్చుకోరని అంటున్నారు. అందువల్ల వారికి అడిగినదే తడవుగా వరాలు కురిపిస్తారు అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఏపీ ఎన్జీవోల సభలో ఏమి చేబుతారు అన్నది ఇపుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News