ఆ పిల్లితో కవితక్కను పోల్చిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే
క్లీన్ చిట్ రాజకీయ నేతగా పేరున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ లేడీ తాజాగా కవితక్కపై వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు
కాలం తీరు భలే సిత్రంగా ఉంటుంది. అందులో భాగంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయం మొదలు మొన్నటి మొన్నటి వరకు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఘాటు విమర్శ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాత్రమే మాట అనే పరిస్థితి. మామూలు నేతలే కాదు.. మహిళా నేతలు సైతం ఆమెను ఉద్దేశించి విమర్శలు చేసేందుకు తొందరపడే వారు కాదు. అలాంటి కవితపై సెటైర్లు పేల్చారు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. క్లీన్ చిట్ రాజకీయ నేతగా పేరున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ లేడీ తాజాగా కవితక్కపై వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు.
తాజాగా ఆమె దీక్షను ప్రస్తావవిస్తూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా ఉందని.. ఆమె తీరుకు నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు. తాజాగా వర్ధన్నపేట.. పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు గాంధీభవన్ లో కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇంతకాలం పక్కన పెట్టిన జాగ్రతిని కవిత మళ్లీ తెరిచారన్న ఆమె.. తెలంగాణ జాగ్రతి గడిచిన పదేళ్లలో ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించిన ఆమె.. ‘‘ఎప్పుడూ గుర్తుకు రాని మహిళలు.. పదవి పోగానే కవితకు గుర్తుకు రావటమా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట అమలు చేసిన ఉచిత బస్సు సౌకర్యం మహిళల కోసమే. గ్యాస్ పథకం.. మహిళలకు రూ.500.. 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటివన్నీ కూడా మహిళల కోసమే’’ అని ఆమె పేర్కొన్నారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ఎన్నో పాపాలు చేసిందన్న ఆమె.. ప్రజలకు మోసాలు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ కు చెందిన పాత నాయకులు.. కొత్త నాయకులు కలిసి కట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా క్రషి చేయాలన్న ఆమె.. రేవంత్ సర్కారు పని తీరుపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. కవితపై ఘాటు విమర్శలు చేసిన యశస్విని రెడ్డి ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.