మా నాన్న కుక్క‌ర్లు.. ఐర‌న్ బాక్సులు పంచి ఎన్నిక‌ల్లో గెలిచాడు!

త‌న తండ్రి, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి సిద్ద రామ‌య్య గురించి సొంత పుత్రుడు య‌తీంద్ర చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయం గా తీవ్ర‌ దుమారం రేపుతున్నాయి.

Update: 2023-09-19 16:11 GMT

సుపుత్రా.. కొంప పీకావు క‌ద‌రా!!- అన్న వ్యాఖ్య‌ల‌ను క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద రామ‌య్య ముద్దుల‌ త‌న‌యుడు నిజం చేశా డు. త‌న తండ్రి, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి సిద్ద రామ‌య్య గురించి సొంత పుత్రుడు య‌తీంద్ర చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయం గా తీవ్ర‌ దుమారం రేపుతున్నాయి. "మా నాన్న ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా చాలా క‌ష్ట ప‌డ్డారు" అని వ్యాఖ్యానించిన య‌తీంద్ర‌.. ఆ వెంట‌నే త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు.

"ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి చాలానే చెప్పాలి. ఈ ఎన్నిక‌లు రాష్ట్రంలో చ‌రిత్రాత్మ‌క‌మే. అంతేకాదు.. పెద్ద పెద్ద నాయ‌కులు కూడా.. అనేక గండాలు దాటుకుని బ‌య‌ట ప‌డ్డారు. మా నాన్న కూడా చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కేందుకు.. ఓట‌ర్ల‌కు కుక్క‌ర్లు, ఐర‌న్ బాక్సులు పంచారు. ఇంకా గోడ గ‌డియారాలు కూడా ఇచ్చారు. చాలా మంది ఇవి మాకొద్దు.. డ‌బ్బులు కావాల‌ని గోల చేశారు. జ‌నాల‌కు డ‌బ్బు పిచ్చి. ఇచ్చింది తీసుకోరు"- అని సిద్ద‌రామ‌య్య కుమారుడు య‌తీంద్ర తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు కూడా ఆయ‌న త‌న తండ్రి సిద్ద‌రామ‌య్య సొంత నియోజ‌క‌వ‌ర్గం వ‌రుణలోనే చేయ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ య‌తీంద్ర ఏమీ చిన్న పిల్లోడో.. రాజ‌కీయ ప‌రిజ్ఞానం లేనివాడో కాదు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యే. కానీ, ఇప్పుడు ఆయ‌న ఏదో మాట్లాడ‌బోయి.. ఏదో మాట్లాడి.. త‌న తండ్రిని నేరుగా ఇరికించేశారు. ఇక‌, దీనిపై రాజ‌కీయ ర‌చ్చ ఓ రేంజ్‌లో ప్రారంభ‌మైంది. బీజేపీ నేత‌లు.. య‌తీంద్ర చేసిన వ్యాఖ్య‌ల రికార్డుల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపాల‌ని నిర్ణ‌యించాయి.

ఇక‌, ఈ అంశంపై మాజీ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నేత బ‌స‌వ‌రాజ బొమ్మై తీవ్రంగానే స్పందించారు. "చూశారా. మేం చెబితే న‌మ్మ‌రు. ఇప్పుడు సిద్ద రామ‌య్య పుత్ర‌ర‌త్న‌మే .. త‌న తండ్రి గెలుపు గురించి నిజాలు చెప్పారు. కాబ‌ట్టి ఆయ‌న సీఎంగానే కాదు.. అస‌లు ఎమ్మెల్యేగా కూడా అన‌ర్హుడే. వెంట‌నే ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకుని.. ఆయ‌న‌పై వేటు వేయాలి. లేక పోతే ఉద్య‌మిస్తాం" అని ఫైర‌య్యారు. మొత్తానికి సిద్ద‌రామ‌య్య‌కు పుత్ర‌ర‌త్నం పెట్టిన సెగ ఇప్పుడు మామూలుగా త‌గ‌ల‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News