జోగి మీద వైసీపీ మార్క్ యాక్షన్ అదేనా ?
మరో వైపు అయితే టీడీపీలో రాజకీయ కలి పుట్టించాలనే జోగి రమేష్ ని వైసీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారా అన్నది కూడా చర్చగా వస్తోంది.
జోగి రమేష్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి. ఆయన్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో సీనియర్ నేత. మొదట కాంగ్రెస్ లో చేరి అనేక పదవులు చేపట్టిన జోగి రమేష్ 2009లో పెడన నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇక 2019లో జగన్ ప్రభంజనంలో ఆయన పెడన నుంచి రెండవసారి గెలిచారు.
జగన్ కేబినెట్ లో చివరి రెండేళ్ళు హౌసింగ్ మినిస్టర్ గా పనిచేశారు. ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్. బలమైన బీసీ నేత. జోగి రమేష్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో ర్యాలీలో కనిపించారు. అది టీడీపీలో అతి పెద్ద రచ్చకు కారణం అయింది. ఏకంగా టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా రియాక్ట్ కావడంతో ఆ ర్యాలీలో పాలుపంచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు అంతా ఒక్కొక్కరుగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు.
వైసీపీ నేతతో రాసుకుని పూసుకుని తిరగడం ఏంటని టీడీపీ హైకమాండ్ గుస్సా అయింది. ఈ పరిణామాలు టీడీపీలో సెగలూ పొగలూ సృష్టించాయి. ఆ పార్టీ తనదైన శైలిలో నేతల నుంచి సంజాయిషీ కోరుతోంది. ఇది ఏ పార్టీ అయినా చేయాల్సిందే.
కానీ అదే టైంలో వైసీపీ వైపు నుంచి చూస్తే కనుక అలాంటిది ఏదీ లేకపోవడం చిత్రంగానే తోస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ ర్యాలీకి వెళ్లిన నేత వైసీపీలో సీనియర్. అధినాయకుడు జగన్ కి అత్యంత సన్నిహితుడు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగిన వారు.
అంతే కాదు ఆయన వెళ్ళిన ఆ ర్యాలీలో మొత్తానికి మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ ప్రోగ్రాం. గౌడ సంఘం ఆర్గనైజ్ చేసింది అని చెప్పుకోవడానికి అయితే వీలు లేదు. ఇతర పార్టీల నేతలు ఎవరూ అక్కడ కనిపించలేదు.
సో అలా కనుక చూస్తే వైసీపీ నేత జోగి రమేష్ టీడీపీ వారిని కలిసేందుకే ఆ మీటింగుకు వెళ్లారు అని అనుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఒక పార్టీలో కీలకంగా ఉన్న నేత వేరే పార్టీ కార్యక్రమాలలో కనిపిస్తే వెంటనే చేయాల్సింది ఏంటి. ఆయన మీద చర్యలు కోవాలి. ఆయన పార్టీ గీత దాటినట్లుగా కూడా భావించాలి.
ముందుగా ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలి. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ తీసుకొవాలి. అది కనుక సంతృప్తికరంగా లేకపోతే ఆయన్ మీద యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇదే ఏ రాజకీయ పార్టీలో అయినా జరిగేది.
కానీ వైసీపీలో అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. చడీ చప్పుడూ లేకుండా ఎందుకు ఉండిపోతున్నారు అన్నది చర్చకు వస్తోంది. జోగి రమేష్ ప్లేస్ లో ఎవరైనా ఉండి ఉంటే ఈ పాటికి షోకాజ్ నోటీసు వచ్చేదా అన్నది కూడా అంటున్న నేపధ్యం ఉంది.
మరి జోగి రమేష్ మీద వైసీపీ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు అంటే దానికి రకరకాలైన విషయాలు వినవస్తున్నాయి. జోగి రమేష్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనకు కోరిన మైలవరం సీటు అప్పగించినా పార్టీ పరంగా అయితే పని ప్రారంభించలేదు అని అంటున్నారు.
దాంతో ఆయన ఎటూ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇపుడు ఆయన ఈ విధంగా టీడీపీతో రాసుకుని పూసుకుని తిరిగితే ఏమవుతుంది అన్న భావనతో వదిలేశారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు అయితే టీడీపీలో రాజకీయ కలి పుట్టించాలనే జోగి రమేష్ ని వైసీపీ నేతలే ప్రోత్సహిస్తున్నారా అన్నది కూడా చర్చగా వస్తోంది. ఏది ఏమైనా జోగి రమేష్ మీద వైసీపీ యాక్షన్ తీసుకోకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏ విధంగా వైసీపీ దీని మీద రియాక్టు అవుతుందో.