నంద్యాల నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు.. వైసీపీకి 'జీరో'.. రీజ‌నేంటి?

అందుకే.. వైసీపీకి త‌గిన విధంగా గుణ పాఠం చెప్పార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Update: 2024-09-13 08:15 GMT

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రి వ‌ర‌కు.. వైసీపీ తెచ్చుకున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను గ‌మ‌నిస్తే.. `జీరో`!! ఇంత ఘోరంగా పార్టీ దెబ్బ‌తిన‌డానికి కార‌ణం.. ఏంటి? ఎందుకిలా జ‌రిగింద‌నేది రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌క్ష పూరిత రాజ‌కీయాల‌ను.. ముఖ్యంగా చంద్ర‌బాబు అరెస్టును ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోయారు. అందుకే.. వైసీపీకి త‌గిన విధంగా గుణ పాఠం చెప్పార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

చంద్ర‌బాబును స్కిల్ కుంభ‌కోణం జ‌రిగిందంటూ.. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు 2023, సెప్టెంబ‌రు 9న నంద్యాల‌లో అరెస్టు చేసిన విస‌యం తెలిసిందే. ఆ రోజు ఆయ‌న అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో ఉన్నారు. ప్ర‌జాగ‌ళం పేరుతో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఇది సాగుతుండ‌గానే.. ఆయ‌న‌ను అర్ధ‌రాత్రి వేళ పోలీసులు చుట్టుముట్టారు. అరెస్టు చేశారు. అక్క‌డ నుంచి తెల్ల‌వారు జామున కారులో రోడ్డు మార్గం గుండా త‌ర‌లించారు. నంద్యాల నుంచి నేరుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఇది రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అంతేకాదు.. వైసీపీ పునాదుల‌ను కూడా.. ఈ ఘ‌ట‌న క‌దిలించి వేసింది. కారులో చంద్ర‌బాబునుత ల‌రిస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న తెలిపారు. నిర‌స‌న కారుల‌తో చంద్ర‌బాబు కూడా.. మార్గ‌మ‌ధ్యంలో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో పోటెత్తిన భావోద్వేగం.. అనంత‌రం జ‌రిగిన‌.. ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో చంద్ర‌బాబుకు, టీడీపీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేందుకు మార్గం సుగ‌మం చేసింది. నంద్యాల‌, గిద్ద‌లూరు, న‌ర‌సారావుపేట‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, ఏలూరు, రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ కూట‌మి విజ‌య‌దుందుభి మోగించింది.

అదేవిధంగా నంద్యాల నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు ఉన్న పార్ల‌మెంటు స్థానాల్లోనూ వైసీపీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. వాస్త‌వానికి ఇలాంటి సీన్ల‌ను సినిమాల్లో మాత్ర‌మే చూస్తాం. కానీ, వైసీపీ చేసుకున్న పాపం.. ప్ర‌జ‌ల్లో పెల్లుబుకిన భావోద్వేగం వంటివి క‌ల‌గ‌లిపి.. ఆ పార్టీకి శాపంగా మారాయి. నంద్యాల నుంచి రాజ‌మండ్రికి చంద్ర‌బాబును త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో పండ‌గ చేసుకున్న వైసీపీనాయ‌కుల‌కు ప్ర‌జ‌లు త‌మ ఓటు ద్వారా భారీ షాకిచ్చారు. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది.

Tags:    

Similar News