వైసీపీ చేసిన ఆ తప్పులు.. అన్ని పార్టీలకు పాఠమే..!
ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.
ఏపీలోఅధికారం కోల్పోయిన వైసీపీ.. విషయంపై మన రాష్ట్రంలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో కారణాలు ఏంటి? అనేవి ఇంకా తెరమీద చర్చకు వస్తూనే ఉన్నాయి. 2లక్షల 70 వేల కోట్ల రూపాయలను సంక్షేమం రూపంలో ప్రజలకు అందించామని.. ప్రజలు ఖచ్చితంగా తమతోనే ఉంటారని వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ భావించారు.
అయితే.. ప్రజలు మాత్రం దీనికి భిన్నమైన తీర్పు వెలవరించారు. కనీసం ప్రధాన పప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వాటిలో రెండు అంశాలు కీలకంగా మారాయి. ఇవి అన్ని పార్టీలకూ పాఠంగా మారాయనే అంటున్నారు పరిశీలకులు. 1) కీలకమైన ప్రజల సెంటిమెంటును పట్టించుకోకపోవడం. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. అమరావతి రాజధాని అనే అంశం.. ప్రజల సెంటిమెంటుపై పనిచేసింది.
మన రాజధాని ఏది? అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అమరావతి అనే పరిస్థితిని గత చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. అయితే.. జగన్ వచ్చిన తర్వాత.. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి.. అమరావతిని తొక్కిపెట్టారు. దీనిపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అన్నా కూడా..వారిలో స్పందన రాలేదు. విశాఖ వాసులు తమకు రాజధానిని వద్దన్నారు. అయినా.. జగన్ మొండిగా వెళ్లి ప్రజల సెంటిమెంటను పట్టించుకోకుండా వ్యవహరించారు. దీంతో ఆయనను వ్యతిరేకించారు.
2) మేనిఫెస్టో పేలవంగా మారడం. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమి పార్టీలు.. బలమైన మేనిఫెస్టో ఇచ్చాయి. రెండేళ్ల ముందునుంచి సూపర్ సిక్స్ పథకాలను టీడీపీప్రజల్లోకి తీసుకువెళ్లింది. కానీ, జగన్‌మాత్రం చంద్రబాబును ప్రజలు నమ్మరని విశ్వసించారు. అందుకే.. తన మేనిఫెస్టోను నిజాయితీగా రూపొందించానని.. చెప్పినవి చేయడం తన లక్షణమన్నారు.కానీ, ప్రజలు తమకు రూపాయి స్థానంలో పది రూపాయలు వస్తుంటే వదులుకోవడాన్ని ఇష్టపడలేదు.
ఇదేసమయంలో జనసేన అధినేత పవన్ కూడా మేనిఫెస్టో హామీలను అమలు చేయించే బాధ్యత నాదని ప్రకటించారు. ఈ ప్రభావం ప్రజలపై ఎక్కువగాఉంది. అంటే.. పార్టీలను, నాయకులను తక్కువగా అంచనా వేసి జగన్ పరాజయం పాలయ్యారు. ఇది కూడా అన్ని పార్టీలకూ పాఠమే అవుతుంది.