వైసీపీ కూసాలు కదిలించే ప్లాన్ లో కూటమి
ఉన్నత వర్గాలు మధ్య తరగతి వర్గాలు ఇలా చాలా మంది ఉండే అర్బన్ లో ఓటు ఎక్కువగా టీడీపీకి వెళ్తుంది.
వైసీపీ బలం ఎక్కడ ఉంది అంటే గ్రామాలలోనే. 2019 ఎన్నికల్లో కూడా అర్బన్ సెక్టార్ టీడీపీకే ఎక్కువగా ఓట్లేసింది. ఉన్నత వర్గాలు మధ్య తరగతి వర్గాలు ఇలా చాలా మంది ఉండే అర్బన్ లో ఓటు ఎక్కువగా టీడీపీకి వెళ్తుంది. ఇక వైసీపీకి రూరల్ లో బేస్ ఎక్కువ.
ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఓటు బ్యాంక్ రూరల్ లోనే పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు వైసీపీకి 2024 ఎన్నికల్లోనూ రూరల్ ఓటర్లు బాగానే ఒట్లేశారు అని అర్ధం అవుతుంది. ఆ ఓట్లు అన్నీ కలవబట్టే వైసీపీకి నలభై శాతం ఓటు షేర్ లభించింది.
అయితే వైసీపీని దెబ్బ తీయాలీ అంటే రూరల్ ఓటునే టార్గెట్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా ఉంది. అందుకే గ్రామ సభలను ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేసేది కూటమి ప్రభుత్వమే అని చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకూ చెప్పారు. గ్రామాలకు తామే ప్రగతి దారులు చూపిస్తామని వారికి దండీగా నిధులు ఇస్తామని చెప్పారు.
ఇక ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా గ్రామ సభలు జరగడం కూడా గొప్ప విషయమే. పైగా ఈ గ్రామ సభలలో సర్పంచ్ అధ్యక్షత వహించారు. అలా సీఎం డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్న సభలలో సర్పంచు హైలెట్ అయ్యారు.
పంచాయతీలకు నిధులు నేరుగా ఇస్తామని వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇది సర్పంచులకు పంచాయతీ వార్డు మెంబర్లకు ఎంతో ఆనందం కలిగించే వార్త గానే ఉంది. సర్పంచులు వైసీపీ ఏలుబడిలో గత అయిదేళ్లుగా చిన్న మొత్తాన్ని కూడా కానలేదు.
పంచాయతీలలో వీధి దీపాలు పోయినా కొని పెట్టించే స్తోమత కూడా పంచాయతీలకు లేకుండా పోయింది. అలాగే పారిశుద్ధ్యం లేకుండా కాలువలలో మురుగు పారుతున్నా పూడికలు తీయించేందుకు పైసా లేదు. పంచాయతీ భవనానికి సున్నం కొట్టించే దిక్కు లేదు. పంచాయతీల వైపు ముఖం చూసే వారు కూడా లేరు.
పోటీగా సచివాలయాలను ఏర్పాటు చేయడంతో అందరూ ఆ వైపు చూడడంతో విధులు నిధులు అధికారాలూ అన్నీ పోయి పంచాయతీ సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇస్తున్న హామీలు వారిని పూర్తి స్థాయిలో కూటమి వైపుగా ఆకట్టుకునేలా చేస్తున్నారు.
నిజం చెప్పాలీ అంటే పంచాయతీలలో నూటికి తొంబై శాతం వైసీపీ మద్దతుదారులే గెలిచారు. అయితే వారిని ఉదాశీనంగా ప్రభుత్వం చూడడంతో పాటు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా చేయడం దారి మళ్ళించడంతో వారంతా వైసీపీ ప్రభుత్వం మీద గుస్సా అయ్యారు. చివరికి వారి ధర్మాగ్రహం కాస్తా ఎన్నికల్లో వైసీపీకి పనిచేయకుండా చేసింది.
అది కూడా వైసీపీ ఓటమికి ఒక అతి ముఖ్య కారణం అయింది. ఈ క్రమంలో పంచాయతీలను ఉద్ధరిస్తామని కూటమి చెబుతోంది. దాంతో సహజంగానే సర్పంచులు ఆ వైపుగా టర్న్ అవుతున్నారు. అలాగే చాలా వార్డులలో మెంబర్లు కూడా కూటమి పార్టీలను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే పంచాయతీలలో జనసేన టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి.
రానున్న రోజులలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇది ఒక అవకాశంగా జనసేన వాడుకుంటూంటే టీడీపీ కూడా గ్రామాలో వైసీపీని భూస్థాపితం చేయమని పిలుపు ఇస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తూంటే పంచాయతీలలో ఫ్యాన్ నీడ లేకుండా చేసేందుకు కూటమి వేసిన ఎత్తుగడగా ఉందని అంటున్నారు.
వైసీపీకి ఎటూ అర్బన్ ఓటింగ్ పెరిగే చాన్స్ లేదు. రూరల్ ఓటింగ్ నే పదిలంగా చూసుకోవాల్సి ఉంది. కానీ రూరల్ లో జనసేన టీడీపీ వేస్తున్న ఎత్తుగడలతో వైసీపీకి దెబ్బ పడిపోయేలా సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టేలాగానే ఉన్నాయి. చూడాలి మరి వైసీపీ దీనికి కౌంటర్ పాలిటిక్స్ ఎలా చేస్తుందో.