జనసేనకు 'గంట' కొట్టనివ్వడం లేదా ..!
విజయసాయిరెడ్డి ఏకంగా పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ పార్టీని నిలబెట్టారు.
గ్రేటర్ విశాఖ పట్నం కార్పొరేషన్ పీఠంపై జనసేన కన్నేసినట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా.. విశాఖ, శ్రీకాకుళం, సహా.. అనంతపురం, చిత్తూరుపై జనసేన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు విశాఖ గ్రేటర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు రాజకీ య వర్గాల్లో చర్చసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేషన్‌ను గత 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. విజయసాయిరెడ్డి ఏకంగా పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ పార్టీని నిలబెట్టారు.
అయితే.. విశాఖలో ఇప్పుడు వైసీపీ చాలా బలహీన పడింది. దీంతో నాయకులు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తున్నారు. అయితే.. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే..జనసేన బలపడేందు కు అవకాశం ఉంటుందని క్షేత్రస్థాయిలో కొందరు వైసీపీ నుంచి జనసేనలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. వీరికి బ్రేకులు వేస్తున్నట్టు పార్టీలో అంతర్గత చర్చగా సాగుతోంది.
వాస్తవానికి వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని కొంద రు ప్రయత్నించారు. కానీ, వారిని ముందు అడ్డుకున్నారు. దీంతో వారంతా జనసేన వైపు చూస్తున్నారు. అయితే.. స్థానికంగా గంటా మరోసారి తన ప్రయత్నాలు సాగిస్తూ.. జనసేనలోకి వెళ్లకుండా అడ్డుకుంటు న్నారు. ముఖ్యంగా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటే.. తమకు మరింత వెసులుబాటు వస్తుందని పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలను నిలువరించేందుకు తన హవాను బలోపేతం చేసేందుకు గంటా ప్రయత్నిస్తున్నారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
మరో వైపు జిల్లాకే చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ నాయకులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. గంటాను ఎదుర్కొనే స్థాయిలో ఆయన రాజకీయాలు లేకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ ఖాళీ కావడం.. కాకపోవడం అనేది గంటా పైనే డిపెండ్ అయిందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ.. స్పందించడం లేదు. అందరూ ఏం జరిగితే అదే జరుగుతుందన్నట్టుగా ఉండిపోతున్నారు.