వారసత్వ లొల్లి మొదలైందా ?
రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లిచ్చినా వాళ్ళని గెలిపించుకునే బాధ్యత తమదే అని హామీలు కూడా ఇస్తున్నారట.
వైసీపీలో వారసత్వ లొల్లి మొదలైందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సిట్టింగ్ ఎంఎల్ఏలే పోటీచేయాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. వారసులకు అవకాశం ఇవ్వాలని కొందరు అడిగితే కుదరదని బహిరంగంగానే చెప్పారు. పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లాంటి వాళ్ళు అడిగినా జగన్ కాదు పొమ్మన్నారు. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైనవి కాబట్టి వారసులకు టికెట్లిచ్చి తాను ఛాన్స్ తీసుకోదలచుకోలేదని చెప్పేశారు.
అయితే పరిస్థితులు మెల్లిగా మారుతున్నాయి. మచిలీపట్నంలో పేర్ని నాని కొడుక్కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కొడుకు భూమన అభినయరెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు. ఎప్పుడైతే మూడు నియోజకవర్గాల్లో వారసులకు పార్టీ టికెట్లు ప్రకటించిందో వెంటనే మరికొందరు సీనియర్లు కూడా అలర్టయ్యారు. తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారట.
ఎమ్మిగనూరు ఎంఎల్ఏ చెన్నకేశవరెడ్డి, మైదుకూరు ఎంఎల్ఏ శెట్టిపల్లి రఘనాధరెడ్డి, బుగ్గన, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారామ్, బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలనాగిరెడ్డి లాంటి మరికొందరు కూడా తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు జగన్ పై బాగా ఒత్తిడి తెస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో వారసులకు టికెట్లు ఇచ్చినపుడు తమ వారసులకు మాత్రం ఎందుకు ఇవ్వరని వీళ్ళంతా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర గట్టిగా పట్టుబడుతున్నట్లు పార్టీవర్గాల టాక్.
రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లిచ్చినా వాళ్ళని గెలిపించుకునే బాధ్యత తమదే అని హామీలు కూడా ఇస్తున్నారట. అయితే వీళ్ళల్లో చాలామంది వారసులకు టికెట్ల విషయాన్ని ఇంకా జగన్ తో ప్రస్తావించలేదు. కాకపోతే పార్టీ వేదికలపైన అంతర్గత సంభాషణల్లో వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నది అయితే వాస్తవం.
మరి టికెట్లను ఫైనల్ చేయాల్సింది జగనే కాబట్టి చివరకు ఏమవుతుందో అనే టెన్షన్ సీనియర్లలో పెరిగిపోతోంది. కరుణాకరెడ్డి రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నారు కాబట్టి కొడుక్కి, చెవిరెడ్డికి జగన్ ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు కాబట్టి కొడుక్కి టికెట్లు ఇచ్చుండచ్చని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. వారసుల అంశం ఏమవుతుందో చూడాలి.